
హైదరాబాద్: భర్త పండ్లు కొనుక్కొని వచ్చేలోపే భార్య అదృశ్యమైన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అండగ్ల శ్రీనివాస్, సువర్ణ (20) దంపతులు. వీరు కర్ణాటకలోని కాలకుండ గ్రామం నుంచి ఈ నెల 14న కూకట్‌పల్లిలోని మేనమామ ఇంటికి బయలుదేరి వచ్చారు. కూకట్‌పల్లి బస్టాప్‌లో దిగిన శ్రీనివాస్..సిగ్నల్ వద్ద భార్య సువర్ణను నిలబడమని చెప్పి కొద్ది దూరంలో ఉన్న షాపులో పండ్లు కొనుగోలు చేయటానికి రోడ్డు దాటాడు. పండ్లు కొనుక్కని ఐదు నిమిషాల లోపే తిరిగి వచ్చి చూడగా.. అతని భార్య కనిపించలేదు. చుట్టు పక్కల ఎంత వెతికినా, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో వెతికినా సమాచారం దొరకలేదు. దీంతో కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.