
వివరాలు తెలుసుకొని మూడు వారాల్లో అఫిడవిట్ వేయండి
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కేసులో పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి తన అఖిల భారత సర్వీస్‌కు పదవీ విరమణ చేశారా.. లేక రాజీనామా చేశారా.. అన్న వివరాలు లేకుండా పిటిషన్ దాఖలు చేస్తే ఎలా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని మూడు వారాల్లో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2021, నవంబర్‌లో జరిగిన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా మాజీ ఐఏఎస్ వెంట్రామిరెడ్డి ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్‌తోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘2007 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి 2021, నవంబర్ 15 వరకు అధికారిగా కొనసాగారు. బీఆర్‌ఎస్‌లో చేరే ఉద్దేశంతో స్వచ్ఛంద పదవీవిరమణ నోటీసు సమరి్పంచారు. అయితే ఐఏఎస్ అధికారుల స్వచ్ఛంద పదవీ విరమణ నియమాల మేరకు నోటీసు ఇచ్చిన మూడు నెలల్లో డీవోపీటీ ఆమోదం తప్పనిసరి. కానీ, వెంకట్రామిరెడ్డి ఎటువంటి రాజీనామా చేయలేదని, పదవీ విరమణ పత్రాలు తమకు అందలేదని నిర్ధారించింది.
ప్రభుత్వ అధికారిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 6(1) ప్రకారం పోటీకి అనర్హుడు. వెంటనే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ.. ఎన్నిక రద్దు చేయాలి’అని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలు తెలుసుకొని అదనపు అఫిడవిట్ వేయాలని చెబుతూ విచారణ వాయిదా వేసింది.