సాక్షి, హైదరాబాద్: పూజలు పూర్తయ్యాక దేవతా చిత్రాలు, విగ్రహాలు, పూజా సామగ్రి వంటి పవిత్ర వస్తువుల నిర్వహణకు శాస్త్రీయ, పర్యావరణహిత విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో శనివారం ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ పేరుతో చేపట్టిన ఈ పైలట్ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా వాలంటీర్ల ఆధ్వర్యంలో పవిత్ర వస్తువుల సేకరణ డ్రైవ్‌ను నిర్వహించింది.
జీహెచ్ఎంసీ, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ (ఇస్కాన్) భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా భక్తులు ఉపయోగించిన దేవతా చిత్రాలు, పాడైన ఫోటో ఫ్రేములు, విగ్రహాలు తదితర పవిత్ర వస్తువులను గౌరవప్రదంగా సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా రీ సైక్లింగ్ చేస్తారు. నగరంలోని అనేక కుటుంబాలు పాత దేవతా చిత్రాలు, దెబ్బతిన్న విగ్రహాలు, పూజా సామగ్రిని సరైన పారవేత విధానం లేక సంవత్సరాల పాటు ఇళ్లలోనే ఉంచుకుంటుంటాయి. కొందరు వాటిని చెట్ల కింద, చెరువుల వద్ద లేదా దేవాలయాల సమీపంలో వదిలివేయడం వల్ల అవి చివరకు చెత్తలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భక్తి భావనకు భంగం కలగకుండా, పర్యావరణ బాధ్యతతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
68 కిలోల పవిత్ర వస్తువుల సేకరణ
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మంది భక్తులు ఈ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 68 కిలోల మేర దేవతా చిత్రాలు, ఫ్రేములు, విగ్రహాలు, ఇతర పవిత్ర వస్తువులు సేకరించారు. సేకరించిన పవిత్ర వస్తువులను వాటి స్వభావం ఆధారంగా వర్గీకరించారు. అనంతరం సంప్రదాయ ‘ఉద్వాసన పూజ’ నిర్వహించి, దైవిక ఉనికిని శా్రస్తోక్తంగా ఉపసంహరించిన తర్వాత వాటిని పునరి్వనియోగం లేదా రీసైక్లింగ్‌కు అనుగుణంగా శాస్త్రీయంగా వేరు చేశారు. సాధారణ మున్సిపల్ చెత్తతో కలపకుండా మొత్తం ప్రక్రియను ప్రత్యేక కేంద్రంలోనే నిర్వహించారు.
పైలట్ దశ విజయవంతమైతే, భవిష్యత్తులో నగరవ్యాప్తంగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత సేవల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతిపాదనను జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది.‘ప్రాజెక్ట్ ఉద్వాసన’లో భాగంగా తదుపరి పవిత్ర వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని జూన్ 13న యూసుఫ్‌గూడలోని శ్రీ హనుమాన్ ఆలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.


