గతంలో ఈ రైళ్లకు మంచి ఆదరణ
కొంతకాలంగా తగ్గిన ప్రయాణికులు
రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ప్రయాణ నిర్ణయంతో మళ్లీ ఆశలు
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్.. ఒకప్పుడు హైదరాబాద్ లైఫ్‌లైన్‌గా లక్షలాది మంది ప్రయాణికులకు చౌకగా రవాణా సదుపాయాన్నిచ్చిన లోకల్ ట్రైన్. 23 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ రైళ్లు అనంతర కాలంలో ప్రాభవాన్ని కోల్పోయాయి. మెట్రో అందుబాటులోకి రావడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వంటి కారణాలతో వీటికి ఆదరణ మరింత తగ్గుముఖం పట్టింది. మరోవైపు రైళ్ల నిర్వహణలో లోపాలు, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలు కూడా తోడయ్యాయి. సిటీబస్ కనెక్టివిటీ లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది.
ఈ క్రమంలో ఎంఎంటీఎస్ రైళ్లకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించించింది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించినట్లుగానే ఎంఎంటీఎస్ రైళ్లలోనూ మహిళలతో పాటు పురుషులకు సైతం ఉచిత ప్రయాణం కలి్పస్తారనే వార్తల నేపథ్యంలో ఈ రైళ్లు మనుగడ సాధిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు, రైల్వే అధికారులతో సమావేశమయ్యారు.
తగ్గిన ప్రాభవం..
మూడేళ్ల క్రితం వరకు ప్రతిరోజు 121 సర్వీసులతో, సుమారు 1.5 లక్షల మందితో కిటకిటలాడిన ఎంఎంటీఎస్ రైళ్లలో ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో రోజుకు 80 నుంచి 85 సర్వీసులు కనా కష్టంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు 35 వేల నుంచి 45 వేల వరకు నమోదువుతున్నారు. కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.15కే సుమారు 60 కి.మీ వరకు ఎంఎంటీఎస్ ప్రయాణ సదుపాయం లభిస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంటే తప్ప సాధ్యం కాదని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నలువైపులా ఎంఎంటీఎస్ రైళ్లు
⇒ ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. రెండోదశ విస్తరణలో భాగంగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు పొడిగించారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం, మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ సదుపాయం పెరిగింది. దీంతో మేడ్చల్ నుంచి నేరుగా ఉందానగర్‌కు కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. ఉందానగర్ నుంచి లింగంపల్లి వరకు అందుబాటులో ఉన్నాయి.
⇒ లింగంపల్లి నుంచి బీహెచ్‌ఈఎల్, తెల్లాపూర్ వరకు కొన్ని సర్వీసులను పొడిగించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఉందానగర్, ఫలక్‌నుమా నుంచి నాంపల్లి మీదుగా కొన్ని రైళ్లు లింగంపల్లి వరకు నడుస్తున్నాయి.
⇒ మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ పొడిగించడంతో నగరానికి ఉత్తరం వైపు కనెక్టివిటీ ఏర్పడింది. ప్రస్తుతం చర్లపల్లి–సికింద్రాబాద్–లింగంపల్లి మధ్య కొన్ని సర్వీసులను నడుపుతున్నారు.
⇒ ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి (రాయగిరి) వరకు ఎంఎంటీఎస్ విస్తరణ పనులు ప్రారంభించారు. రెండు, మూడేళ్లలో ఈ మార్గంలో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
కనెక్టివిటీ పెరగాలి..
సిటీబస్, మెట్రో, ఎంఎంటీఎస్ మధ్య కనెక్టివిటీని పెంచేందుకు హుమ్టా పలు ప్రతిపాదనలు చేసింది. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం రైల్వేస్టేషన్‌లకు 30 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, తదితర వాహనాలు ఈజీగా రాకపోకలు సాగించేందుకు అనువుగా స్టేషన్ ప్రాంగణం ఉండాలి.
⇒ నగరంలోని 51 ఎంఎంటీఎస్ స్టేషన్‌లకు బస్సులు, వాహనాలు వెళ్లేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ రోడ్ల విస్తరణ చేపట్టాలి.
⇒ సిటీబస్సులే కాకుండా అన్ని రకాల వాహనాలు జీపీఎస్ ఆధారంగా రాకపోకలు సాగించే సదుపాయం ఉండాలి.


