అదృష్ట దేవతమీదేనంటూ వల

Fraudulent Lottery Schemes At Kamareddy District - Sakshi

లాటరీ పేరిట లూటీ!

పుట్టగొడుగుల్లా స్కీంలు 

ఒక్క కామారెడ్డి జిల్లాలోనే  45 గ్రూపులు 

పది జిల్లాలకు విస్తరించిన అక్రమ దందా 

రూ. కోట్లు కొల్లగొడుతున్న వైనం 

సాక్షి, కామారెడ్డి: ‘లాటరీలో అదృష్ట దేవత మీ తలుపు తట్టొచ్చు.. దాంతో డబ్బులు సులువుగా సంపాదించొచ్చు.. కారో, బంగారు నగలో.. ఏదో ఒకటి మీ సొంతం’అంటూ లాటరీ స్కీంల నిర్వాహకులు ప్రజలను బుట్టలో వేస్తున్నారు. నెలనెలా ఊహించని బహుమతులు మీ సొంతం కావొచ్చంటూ అందమైన బ్రోచర్లను ముద్రించి సభ్యులను చేర్పిస్తున్నారు. అక్రమ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మొదలైన ఈ అక్రమ దందా ప్రస్తుతం పది జిల్లాలకు విస్తరిం చింది.  కొంతకాలం కిందట రూ.30 వేలు కడితే నెలనెలా రూ.10 వేల చొప్పున పది నెలల పాటు మొత్తంగా రూ.లక్ష ఇస్తామంటూ నమ్మబలికిన ‘బీర్షేబా’అనే సంస్థ ప్రజల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఇది మరచిపోకముందే లాటరీల పేరుతో లూటీ జరుగుతోంది. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే ఇలాంటివి 45 స్కీంలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులే స్కీంల నిర్వాహకులుగా అవతారం ఎత్తడంతో  అడ్డుకునే వారు లేకుండా పోయారు.  

3 వేలకు పైగా సభ్యులతో.. 
ఒక స్కీం నిర్వాహకులు 2,999 మంది సభ్యులను చేర్చుకుని, నెలకు రూ.వెయ్యి చొప్పున 15 నెలల పాటు వసూలు చేశారు. మరో స్కీం నిర్వాహకులు 3 వేల మంది సభ్యులతో, నెలకు రూ.1,500 చొప్పున 12 నెలల పాటు వసూలు చేశారు. మరో స్కీం నిర్వాహకులు 3,500 మంది సభ్యులను చేర్చుకుని నెలకు రూ.1,200 చొప్పున 12 నెలల పాటు నడిచే స్కీం పెట్టారు. ఇలా జిల్లాలో దాదాపు 45 స్కీంలు కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో మొదలైన దందా మెదక్, సిద్దిపేట, నిర్మల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ తదితర జిల్లాలకూ విస్తరించింది. కామారెడ్డికి చెందిన నిర్వాహకులు అక్కడి వారిని ఏజెంట్లుగా చేర్చుకుని దందాను నడుపుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్కీంలలో దాదాపు 1.3 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు అంచనా. 

ఆకర్షణీయ బహుమతులు 
స్కీంల నిర్వాహకులు మంచి బహుమతులంటూ అమాయకులను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. 2,999 మంది సభ్యులు ఉంటే అందరికీ కచ్చితమైన బహుమతి అని చెబుతున్నారు. ఇందులో బంపర్‌ డ్రాలుగా కార్లు, బంగారు ఆభరణాలు, ట్రాక్టర్లు, మోటార్‌ సైకిళ్లు, స్కూటీలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, సెల్‌ఫోన్ల వంటివి ఇస్తున్నారు. మొత్తం సభ్యుల్లో 200 మంది వరకు బంపర్‌ డ్రాలో పెద్ద పెద్ద బహుమతులు వస్తాయి. ఆఖరుకు మిగిలిన సభ్యులకు తలా ఒక చిన్నపాటి బహుమతి ఇస్తారు. సభ్యుడు నెలకు వెయ్యి చొప్పున రూ.15 వేలు చెల్లిస్తే, అతనికి ఇచ్చే బహుమతి విలువ రూ.5 వేల లోపే ఉంటుంది. కానీ సభ్యులకు బంపర్‌ డ్రాల ఆశ చూపి సభ్యులుగా చేర్పిస్తున్నారు. 

రూ. కోట్ల దందా.. 
జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కోట్లకొద్దీ రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక స్కీంలో 15 నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున 3 వేల మంది సభ్యులు చెల్లించే మొత్తం రూ.4.5 కోట్లు అవుతుంది. ఇందులో బంపర్‌ బహుమతులు, మిగతా సభ్యులందరికీ ఇచ్చే సాధారణ బహుమతులన్నింటికీ కలిపి రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఏజెంట్లకు కమీషన్‌గా రూ.20 లక్షల వరకు చెల్లిస్తున్నారు. మరో రూ.50 లక్షల వరకు ఇతర ఖర్చులు పోయినా ఒక్కో స్కీం ద్వారా రూ.2 కోట్ల వరకు మిగులుబాటు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏ కష్టం లేకుండా రూ.కోట్లు వస్తుండడంతో ఒక్కో స్కీం నిర్వాహకుడు కొత్తగా మరికొన్ని స్కీంలు రూపొందించి ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వీటిపై దృష్టి సారించారు. 

నిర్వాహకులపై కఠినచర్యలు
బంపర్‌ డ్రాల పేరుతో కొందరు లాటరీలను నడుపుతున్నారు. అలాంటి వాటికి ఏ రకమైన అనుమతులు లేవు. ఇలాంటి స్కీంలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ప్రజలు అత్యాశకు పోయి డబ్బులు పెట్టి మోసపోతున్నారు. లక్కీ డ్రాల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వండి. 08468–226633 నంబరుకు కాల్‌ చేయండి.     
 – శ్వేత, కామారెడ్డి ఎస్పీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top