నమ్మి పార్టీకీ వెళ్లావా.. టోపీ ఖాయం! | Fraudulent Financiers Cheated 20 Members In Hyderabad | Sakshi
Sakshi News home page

నమ్మి పార్టీకీ వెళ్లావా.. నిండా ముంచేస్తారు!

Aug 22 2020 8:15 AM | Updated on Aug 22 2020 9:20 AM

Fraudulent Financiers Cheated 20 Members In Hyderabad - Sakshi

వీరి చేతిలో దాదాపు 20 మంది మోసపోయారు. బాధితుల్లో ఒకరైన సోమాజిగూడకు చెందిన బి.విజయలక్ష్మి ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది.

సాక్షి, సిటీబ్యూరో: ప్రధానంగా మహిళల్ని టార్గెట్‌గా చేసుకుంటారు. పరిచయస్తుల ద్వారా ఎర వేస్తారు..ఖరీదైన హోటళ్లు, రిసార్ట్‌ల్లో పార్టీలు ఇస్తారు..ఇలా తమ డాబు ప్రదర్శించి, అధిక వడ్డీ ఆశ చూపి అందినకాడికి వసూలు చేస్తారు.. ఒకటి–రెండు నెలలు లాభమంటూ కొంత మొత్తం ఇచ్చి ఆపై చేతులెత్తేస్తారు..ఈ పంథాలో ఏడాదికి కాలంలో రూ.13 కోట్ల వసూలు చేసిన భార్యాభర్తల్ని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన భార్యాభర్తలు పీత పద్మజ అలియాస్‌ పద్మిని, వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్‌ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి స్థిరపడ్డారు. గతంలో సైబరాబాద్‌ పరిధిలోని కార్యకలాపాలు సాగించిన స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో పని చేశారు. ఈ సంస్థపై ఇటీవలే మాదాపూర్‌ పోలీసులు రూ.156 కోట్ల స్కామ్‌కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి ముందే ఆ సంస్థలో మానేసిన భార్యాభర్తలు శ్రీనగర్‌కాలనీలో రణధీర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేరుతో కార్యాలయం తెరిచారు. దీని ముసుగులో అనేక మందితో పరిచయాలు పెంచుకున్నారు.
(చదవండి: కరోనాలోను రియల్‌ ఎస్టేట్‌ దూకుడు: సర్వే)

తాము సినిమాలకు, ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ ఇస్తూ ఉంటామని ఎర వేశారు. తమ వద్ద పెట్టుబడి పెడితే నెలకు 5 నుంచి 10 శాతం వడ్డీలు ఇస్తామంటూ నమ్మబలికారు. ఆసక్తి చూపిన వారికి ఖరీదైన పార్టీలు ఇచ్చి మరింత ఆకర్షించేవాళ్లు. ఇలా డిపాజిట్‌ చేసిన వారికి ఒకటి–రెండు నెలలు సక్రమంగానే వడ్డీ చెల్లించే వారు. ఆ తర్వాత చేతులు ఎత్తేసి మోసం చేసేవాళ్లు. ఒకరి ద్వారా మరొకరిని పరిచయం చేసుకుంటూ తమ దందా కొనసాగించారు. చివరకు లాక్‌డౌన్‌ టైమ్‌లోనూ వీరి ‘వ్యాపారం’ ఆగలేదు.

ఇలా గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు రూ.13 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసి మోసం చేశారు. వీరి చేతిలో దాదాపు 20 మంది మోసపోయారు. బాధితుల్లో ఒకరైన సోమాజిగూడకు చెందిన బి.విజయలక్ష్మి ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. దీన్ని ఇన్‌స్పెక్టర్‌ కేవీ సూర్యప్రకాష్‌ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు శుక్రవారం భార్యభర్తల్ని అరెస్టు చేసింది.   
(చదవండి: రూ.156 కోట్ల ‘రియల్‌’ మోసం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement