
సిద్దిపేట జిల్లా నంగునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం బారులుతీరిన రైతులు
యూరియా కోసం బారులుతీరిన రైతులు
సాక్షి, మహబూబాబాద్/సిద్దిపేట/తిప్పర్తి: పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నారు. మహబూబా బాద్‌లోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు క్యూలైన్‌లో నిలబడి నిరీక్షించారు. మహబూబాబాద్ మండలం సింగారంలో ఓ దుకాణ యజమాని రైతులకు నేరుగా విక్రయించినట్టు తేలడంతో అతడి లైసెన్స్ సస్పెండ్ చేశారు. చిన్నగూడూరు మండలం విస్సంపల్లిలోనూ ఓ మందుల దుకాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ షాప్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.
నెల్లికుదురు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు కుటుంబ సమేతంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షంలోనూ లైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూశారు. తొర్రూరులోని పీఏసీఎస్ ఎదుట రైతులు బారులు తీరారు.ఈ క్రమంలో ఓ రైతు అధికారి కాళ్లు మొక్కి యూరియా బస్తాలు ఇవ్వాలని వేడుకున్నాడు.ఈ ఘటనపై మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించారు.
‘కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాతరోజులు వచ్చాయని, రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి దాపురించింది’అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు పీఏసీఎస్ వద్ద కూడా రైతులు బారులుతీరారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలోని పీఏసీఎస్‌లోనూ రైతులు క్యూలో నిల్చున్నారు. వెనుక ఉన్నవారికి యూరియా దొరకక నిరుత్సాహంతో వెనుదిరిగారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో యారియా అందించాలని మహిళా రైతులు అధికారుల కాళ్లు మొక్కారు.