కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన
హన్మకొండ/గీసుకొండ: దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రభుత్వంపై వరంగల్ నుంచి ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ప్రకటన వచ్చిందని స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు బుధవారం పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు చేరుకుని కై టెక్స్ కంపెనీతో పాటు పార్కును సందర్శించారు. అక్కడి నుంచి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజ్యాంగ దివస్‌లో భాగంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మడికొండలోని రెడ్డి కన్వెన్షన్‌లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్‌రెడ్డి కుమార్తె భార్గవిరెడ్డి, ఉదయ్‌రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని, దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ కోసం రేవంత్ సర్కారు రూ.160 కోట్లు ఖర్చుపెట్టిందని, బిహార్‌లో రాహుల్ గాంధీ డబ్బా కొట్టినా ఫలితం లేదని తూర్పారబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించి బీసీలకు రేవంత్ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీసీలకు క్షమాపణ చెప్పాలి..
కామారెడ్డి డిక్లరేషన్‌తో బీసీలతో ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. చెంపలేసుకుని సీఎం బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ లేదు..
అప్పుడప్పుడు ఇలా జరిగితేనే మంచిదని రాష్ట్రంలో అధికారం కోల్పోవడంపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ లేదని, ప్రభుత్వం పోయిందని నిరుత్సాహపడాల్సింది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ సీఎం కావాలని బ లంగా కోరుకుంటున్నారన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు డీఎస్ రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, సాంబారి సమ్మారావు, ఎల్లావుల లలితాయాదవ్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేఎంటీపీతో 30 వేలమందికి ఉపాధి
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ) పూర్తయితే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. గతంలో ఆజంజాహి మిల్లు మూతబడి వైభవాన్ని కోల్పోయిన వరంగల్‌కు కేఎంటీపీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిందన్నారు. నేత కార్మికులు వలసలు వెళ్లకుండా ఉండేందుకు 2017 అక్టోబర్ 22న పార్కు పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గణేశా, యంగ్‌వన్, కై టెక్స్ కంపెనీల్లో ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. కేఎంటీపీని కేంద్రం పీఎం మిత్ర కింద ఎంపిక చేసిందన్నారు.
దీక్షా దివస్ స్ఫూర్తితో వరంగల్ నుంచి ప్రతిఘటన
ఓట్లు వేయించుకుని బీసీలను మోసం చేసిన కాంగ్రెస్
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటన


