
తల్లీకొడుకులే సూత్రధారులు
సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు
ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్టు
అదుపులోకి ఆరుగురు మహిళలు
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో బయటపడిన వ్యవహారం
కుత్బుల్లాపూర్: నగరంలో సంచలనం సృష్టించిన ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ సరోగసీ కేసు విషయం మరవకముందే మేడ్చల్ జిల్లాలో మరో అక్రమ సరోగసీ సెంటర్ బండారం బయట పడింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా ఎస్‌ఓటీ పోలీసులు, జిల్లా వైద్యశాఖ అధికారుల సహాయంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రింగ్‌రోడ్డు సమీపంలోని సెంటర్‌పై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మరో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులిద్దరూ తల్లీ కొడుకులే కావడం గమనార్హం. పేట్‌బషిరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, మేడ్చల్ డీఎంహెచ్‌ఓ ఉమాగౌరితో కలిసి వివరాలు వెల్లడించారు.
ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన నారెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి తన కుమారుడు నరేందర్‌రెడ్డితో కలిసి కుత్బుల్లాపూర్, చింతల్‌లో ఉంటోంది. గతంలో లక్ష్మి అండం దాతగా, సరోగసీ తల్లిగా వ్యవహరించింది. దీంతో ఆమెకు పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్‌లతో సంబంధాలు ఏర్పడ్డాయి. క్లినిక్ నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుని సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అండం దానం, సరోగసీ తల్లిగా వ్యవహరించే వారిని గుర్తించి తానే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. దీంతో బీటెక్ పూర్తి చేసిన తన కొడుకు నరేందర్‌రెడ్డితో కలిసి వ్యూహ రచన చేసింది.
సెంటర్‌పై దాడి..
విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్‌ఓటీ, పేట్‌బషిరాబాద్ పోలీసులు వైద్యశాఖ అధికారుల సహాయంతో సెంటర్‌పై దాడి చేశారు. లక్ష్మి, నరేందర్‌రెడ్డిలను అరెస్ట్ చేసి అద్దె గర్భ మహిళలు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన గోల్కొండ సాయిలీల, ఏపీలోని రంపచోడవరం ప్రాంతానికి చెందిన మల్లగల్ల వెంకటలలక్ష్మి, సాదల సత్యవతి, విజయనగరం నివాసులు పంటడ అపర్ణ, రమణమ్మ, అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన పి.సునీతలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.6.47 లక్షల నగదు, ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మిపై 2024లో ఇదే తరహాలో ముంబైలో కేసు నమోదైంది.
విచారణ కొనసాగుతోందని, ఇందులో ప్రమేయమున్న ప్రైవేటు ఆస్పత్రులు, ఫెర్టిలిటీ క్లినిక్‌లను గుర్తించి వాటిపై పట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ ఎ.విశ్వప్రసాద్, ఏసీపీ బాలగంగి రెడ్డి, ఎస్‌ఓటీ, పేట్‌బషిరాబాద్ పోలీసులు పాల్గొన్నారు.
నిరుపేద మహిళలే లక్ష్యంగా..
లక్ష్మి పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్‌లతో బేరం కుదుర్చుకుని భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న, నిరుపేద మహిళలే లక్ష్యంగా మచి్చక చేసుకుటుంది. ఆపై వారికి డబ్బు ఆశ చూపించి అండం దానం, సరోగసీ తల్లిగా వ్యవహరించేలా ఒప్పందం చేసుకుంటుంది. ఈ క్రమంలో వారిని తన ఇంట్లోనే పెట్టుకుంది.