ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో సంస్కరణలకు కసరత్తు
కాలేజీ ఖాతాకు బదులు విద్యార్థులకు ఇవ్వాలని సంక్షేమ శాఖల యోచన
ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు నేరుగా ఫీజుల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మరింత సంస్కరించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఫీజుల చెల్లింపుల్లో మరింత పారదర్శకత పాటించడంతోపాటు సులభతరంగా చెల్లింపులు చేసేందుకు మరిన్ని మార్పులు తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద చెల్లించే ఫీజులను కాలేజీ యాజమాన్య ఖాతాల్లో కాకుండా నేరుగా విద్యార్థి ఖాతాకు విడుదల చేసేలా నిబంధనల మార్పునకు శ్రీకారం చుడుతున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ గత విద్యాసంవత్సరం నుంచి విద్యార్థి ఖాతాకు ఫీజులు విడుదల చేస్తుండగా గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖలు కూడా నేరుగా విద్యార్థులకే ఫీజులు విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాయి. తాజాగా ఈ ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపాక ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం.
కాలేజీల ఆధిపత్యానికి చెక్...
సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో కాలేజీల యాజమాన్యాల ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫీజు నిధుల విడుదలలో జాప్యం వల్ల ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఫీజు అందే దాకా విద్యార్థుల ధ్రువపత్రాలు ఇచ్చేందుకు చాలా కాలేజీల యాజమాన్యాలు నిరాకరిస్తుండటం వల్ల కోర్సులు పూర్తి చేసినా ఉద్యోగ ఇంటర్వ్యూలు, చేరికల వేళ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలేజీలు ఫీజు పథకం పరిధిలోని విద్యార్థుల నుంచి కూడా ముందస్తుగా ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీల ఆదిపత్యానికి చెక్ పెట్టడంతోపాటు విద్యార్థికి నేరుగా ఫీజులు చెల్లించడం వల్ల పారదర్శకత ఉంటుందనే కోణంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నెలవారీగా నిధులు..
ఈ అంశంపై బీసీ సంక్షేమం, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సంక్షేమ శాఖల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇకపై సంక్షమ శాఖలకు నెలవారీగా బడ్జెట్ విడుదల చేస్తామని ఈ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. నెలకు రూ. 500 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తే అందులో గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణతోపాటు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులకు వాటిని వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. ఈ క్రమంలో నెలవారీగా నిధులు విడుదల చేస్తే ఉపకార వేతనాలు, ఫీజుల కోసం నెలకు రూ. 200 కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం.


