‘జీవో 111’ ట్రబుల్‌ వన్‌.. జీవో నంబర్‌ 69 అమలుపై నీలినీడలు

Due To GO 111 Sanctions On 84 Villages Ongoing In Telangana - Sakshi

కొత్త మాస్టర్‌ ప్లాన్ దిశగా ముందుకు పడని అడుగులు 

ఒక్కసారి మాత్రమే భేటీ అయిన సర్కారు కమిటీ 

ఆ 84 గ్రామాల పరిధిలో నిర్మాణాలపై కొనసాగుతున్న ఆంక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిన 111 జీవోను రద్దు చేసి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది కావస్తున్నా.. నేటికీ అడుగు ముందుకుపడలేదు. ప్రస్తుతం రాజధాని దాహార్తిని తీర్చేందుకు ఈ జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచి్చన 111 జీవోను రద్దు చేస్తూ గతేడాది ఏప్రిల్‌ 19న జీవో నంబర్‌ 69ను విడుదల చేసింది. జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తామని ప్రకటించింది. కానీ నేటికీ ఆయా గ్రామాలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం జీవసంరక్షణ మండలి(బయో కన్జర్వేషన్‌ జోన్‌)లోనే కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఆంక్షలే ఇప్పటికీ అమలులో ఉండడంతో నిర్మాణదారులకు ఇక్కట్లు తప్పడంలేదు.

చిత్తశుద్ధిలేని కమిటీ..
కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను సాధ్యమైనంత త్వరగా రూపొందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందుకోసం సీఎస్‌ నేతృత్వంలో కమిటీని వేసింది. పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ (ప్లానింగ్‌) సభ్యులుగా ఉండే ఈ కమిటీ.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను కూడా ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని అలాగే ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలను రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, మురుగునీటి నిర్వహణ ప్లాంట్ల (ఎస్టీపీలు) ఏర్పాటు, నిధుల సమీకరణ, లేఅవుట్లు, నిర్మాణాల అనుమతికి సంబంధించిన విధివిధానాలతో పాటు న్యాయపరమైన అంశాలనూ పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు తొలిసారి భేటీ అయిన కమిటీ కేవలం ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించి మమ అనిపించింది. మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో జీవో 69 అమలుపై ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు.  

నిర్మాణదారులకు ఇక్కట్లు..
జంట జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఆయా భూముల్లో ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు తక్కువ ధరకు పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇవే కాకుండా అనధికారిక లే–అవుట్లూ వేల సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం 111 జీవో ఎత్తివేసినందున నిర్మాణాలపై ఆంక్షల్లేవని భావించి అనుమతుల కోసం స్థానిక పట్టణ, పంచాయతీలను ఆశ్రయిస్తున్న రియల్టర్లు/భవన నిర్మాణదారులకు నిరాశే మిగులుతోంది. పర్మిషన్లు జారీ చేయకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, 111 జీవో ఇంకా మనుగడలోనే ఉందని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో 69 జీవో అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు ఏదైనా నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోసం వెళితే ఆంక్షల నెపంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, అదే పలుకుబడి ఉన్న నాయకులు, ఆమ్యామ్యాలు సమర్పించుకునే డెవలపర్లకైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top