‘రోగుల ఆశీర్వాదాలే మాకు యాంటీబాడీస్‌’

Doctors Day Special Story TS Government Doctors Struggle Over Covid - Sakshi

విషమ పరిస్థితులు.. ఇబ్బందికర వాతావరణం

అయినా రోగులకు పునర్జన్మ ఇచ్చామన్న సంతృప్తి మాకు కొండంత బలం

ప్రైవేట్‌ కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సరైన వైద్యం

అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే కోవిడ్‌ చికిత్స

ఏడాదిన్నరగా కరోనా రోగుల మధ్య..

నేడు డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ల మనోగతం

ఏడాదిన్నరగా కరోనాతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మహమ్మారి బారిన పడిన ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నారు. నిరుపమాన సేవ తో.. ‘వైద్యులు కన్పించే దేవుళ్లు’ అనే నానుడిని నూటికి నూరుపాళ్లూ నిజం చేస్తున్నారు. తమ ప్రాణాలనూ పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో వైరస్‌ బారిన పడిన కొందరు అసువులు బాశారు. మరి కొందరు కుటుంబసభ్యుల్ని కోల్పోయారు. గురువారం ‘డాక్టర్స్‌ డే’ సందర్భంగా.. ఆస్పత్రుల్లో రోగుల మధ్య పోరాడుతున్న వైద్యులకు సారథ్యం వహిస్తూ, ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు చేస్తూ, రోగులకు సరైన చికిత్స, సౌకర్యాలు అందేలా నిర్విరామ కృషి చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ‘సాక్షి’ పలకరించింది. కరోనాతో రోగులు కళ్లెదుటే కన్ను మూస్తుంటే విలవిల్లాడిపోయామని, కోలుకున్న రోగులు, వారి కుటుంబసభ్యులు ఇచ్చిన ఆశీర్వాదాలే తమకు కొండంత బలాన్నిచ్చాయని అంటున్న సూపరింటెండెంట్ల మనోగతం వారి మాటల్లోనే..    –సాక్షి, హైదరాబాద్‌

50వేల మందికి చికిత్స చేశాం
గాంధీ ఆస్పత్రికి ఎక్కువగా ప్రాణాపాయస్థితి లో ఉన్నవారే వస్తుంటారు. వీరిని కాపాడేందుకు అహర్నిశలు శ్రమించాల్సి వస్తోంది. ఒక వైపు పరిపాలనా వ్యవహారాలు చక్కబెడుతూనే, మరో వైపు జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతిగా పీపీఈ కిట్‌ ధరించి రోజంతా రోగుల మధ్య గడపాల్సి రావడం మొదట్లో కొంత ఇబ్బందిగానే అన్పించేది. కానీ ప్రాణపాయస్థితిలో వచ్చిన రోగి కోలుకుంటే, పునర్జన్మను ప్రసాదించామనే సంతృప్తి కొండంత బలాన్నిచ్చేది. కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు వారు, వారి కుటుంబసభ్యు లు ఇచ్చిన ఆశీర్వాదాలు.. ఇమ్యూనిటీ బూస్టర్లుగా పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. వారి ఆశీర్వాదాలే మాకు యాంటీబాడీస్‌ అని చెప్పుకోవ చ్చు. 15 నెలల నుంచి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా విధులు నిర్వహిస్తున్నా. ఫస్ట్‌వేవ్‌లో 35 వేల మందికి విజయవంతంగా చికిత్స చేశాం. సెకండ్‌ వేవ్‌లో 15 వేల మందికి చికిత్స అందించాం. ఇప్పటివరకు 1,500 మంది కోవిడ్‌ గర్భిణులకు పురుడు పోశాం.  – డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి

450 మందికి కరోనా సోకింది
కోవిడ్‌ ఆస్పత్రుల్లోని వారు మాత్రమే కాదు, నాన్‌ కోవిడ్‌ కేంద్రాల్లో పని చేసే వైద్య సిబ్బంది కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. గాంధీని పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా మార్చడం తో భారమంతా ఉస్మానియా ఆస్పత్రిపైనే పడింది. వివిధ ప్రమాదాల్లో గాయపడినవారు, గుండె, కాలేయం, కిడ్నీలు, మధుమేహం, హైపర్‌టెన్షన్, ఇతర అత్యవసర బాధితులు ఎక్కువగా వచ్చేవారు. వీరిలో ఎవరికి వైరస్‌ ఉందో? ఎవరికి లేదో? గుర్తించడం సవాల్‌గా మారింది. ప్రమాద క్షతగాత్రులకు వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చేది. అప్పటికే వీరికి వైరస్‌ సోకి ఉండటంతో వైద్య సిబ్బందికి వ్యాపించేది. వారి కుటుంబ సభ్యులకు సోకేది. ఇలా ఫస్ట్‌వేవ్‌లో 300 మంది, సెకండ్‌ వేవ్‌లో 150 మంది వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ బాధితుల్లో నేను కూడా ఒకడిని. – డాక్టర్‌ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆసుపత్రి 

చాలా ఒత్తిడికి గురయ్యాం
కరోనా కారణంగా నిత్యం వందల మంది రోగులకు వైద్యం అందించాల్సి రావటంతో మాపై పని ఒత్తిడి బాగా పెరిగింది. ఇలాంటి పరిస్ధితులు మునుపెన్నడూ చూడలేదు. మొదటి వేవ్‌లో కంటే రెండో వేవ్‌లో చాలా ఒత్తిడికి గురయ్యాం. మొదటి సారి 200 పడకల్లో వైద్య సేవలు అందించగా, రెండో వేవ్‌లో 320 బెడ్లను ఏర్పాటు చేశాం. పూర్తి ఆక్సిజన్‌న్‌సౌకర్యంతో రోగులకు ఎక్కడా ఇబ్బంది కలుగని రీతిలో చర్యలు తీసుకున్నాం. తొలిదశలో 70 మంది, రెండో సారి 50 మంది వరకు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయినా వారు కోలుకొని తిరిగి విధుల్లో చేరి సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే చికిత్స అందుతోంది. – డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఖమ్మం

రోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం
కరోనా రోగులకు వైద్యులు, నర్సులు భయపడకుండా సేవలందిస్తున్నారు. మేము ధైర్యంగా ఉండటమే కాదు.. రోగులకు కూడా ధైర్యం చెబుతూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం. గత ఏడాది కాలంలో జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుల్లో 10 మంది, సిబ్బందిలో 35 మంది కరోనా బారినపడ్డారు. అందరూ ధైర్యంగా కరోనాను ఎదుర్కొని మళ్లీ విధుల్లో చేరారు. – డాక్టర్‌ సంగారెడ్డి, సూపరింటెండెంట్, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి

కష్టాలు కళ్లారా చూశాం
జిల్లాలో మొదట్లో తక్కువ కేసులున్నా తరువాత ఒక్కసారిగా కరోనా  విజృంభించింది. ఎన్నడూ లేనివిధంగా రోగులు కష్టపడటం కళ్లారా చూశాం. ఫస్ట్‌వేవ్‌లో ప్రజలు కొంత నిర్లక్ష్యం చేసినా ప్రాణ నష్టం అంతగా జరగలేదు. కానీ సెకండ్‌ వేవ్‌లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిÐ ] రకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని పనులు ఉన్నా సెలవులు తీసుకోకుండా పని చేశాను.  – డాక్టర్‌ అజయ్‌కుమార్, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్, కామారెడ్డి 

ఇంట్లో వారికి కరోనా వచ్చినా..
మా కుటుంబ సభ్యులందరికీ కరోనా వచ్చినా వారిని హోం ఐసోలేషన్‌లో పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించా. కరోనా సోకిన వారిని నిరంతరం పర్య వేక్షిస్తూ మనోధైర్యం కల్పించాం. సెకండ్‌ వేవ్‌లో 2,089 మంది కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. 1,666 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 30 మందిని వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఖమ్మం, హైదరాబాద్‌ ఆసుపత్రులకు తరలించాం. – డాక్టర్‌ సరళ,  జిల్లాఆసుపత్రి సూపరింటెండెంట్, కొత్తగూడెం

యుద్ధంలో గెలిచినæ సంతృప్తి
ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లిన వారు ఇప్పటికీ ఫోన్లు చేస్తుంటా రు. అప్పుడు ఒక సైనికుడు యుద్ధంలో గెలిచి ఎంత సంతృప్తి పొందుతాడో నాకూ అంతే సంతృప్తిగా అన్పిస్తుంది. సెకండ్‌ వేవ్‌ ఒక గుణపాఠం లాంటిది. మున్ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని వైద్యసేవలు అందిస్తామనే పూర్తి నమ్మకం నాకు, మా వైద్యులకు కలిగింది. ఇక నాకు ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లో కూడా కరోనా సోకింది. – డాక్టర్‌ ప్రతిమరాజ్, నిజామాబాద్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం
నేను సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగు రోజులకే ఎంజీఎం ఆస్పత్రిని సీఎం సందర్శించారు. సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి కరోనా విభాగంలో 800 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్న క్రమంలో ఏ రోగి ఏక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి నెలకొనేది. ఈ సమన్వయ లోపాన్ని తొలగించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఏ రోగి ఏక్కడ ఉన్నాడు? ఎన్ని రోజుల క్రితం వచ్చాడు? ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకునేందుకు వీలుగా ఈ విభాగం ఏర్పాటు చేశాం. – డాక్టర్‌ చంద్రశేఖర్, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, వరంగల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top