
యాదగిరిగుట్టపైకి వచ్చే మహిళా భక్తుల ప్రయాణానికి చార్జీ చెల్లిస్తున్న దేవస్థానం
ఇప్పటివరకు అద్దె బస్సులకు దేవస్థానం రూ.25 కోట్ల ఖర్చు
సొంత బస్సుల కొనుగోలుపై దృష్టి సారించని దేవస్థానం
సాక్షి, యాదాద్రి: ఆర్టీసీ బస్సుల్లో యాదగిరిగుట్టపైకి వచ్చే మహిళా భక్తులకు సైతం దేవస్థానమే టికెట్ డబ్బులు చెల్లిస్తోంది. ఆర్టీసీ 2022 మార్చి 23 నుంచి కొండపైకి అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతోంది. ఇందుకుగాను దేవస్థానం అద్దె చెల్లిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. గుట్టపైకి వచ్చే మహిళా భక్తులకు సైతం ఆర్టీసీకి ప్రతి నెలా దేవస్థానం డబ్బులు చెల్లిస్తోంది.
కొండపైకి బస్సులను నడిపినందుకు ఇప్పటి వరకు దేవస్థానం ఆర్టీసీకి సుమారు రూ.25 కోట్ల వరకు చెల్లించిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇంత మొత్తం ఖర్చుచేసిన దేవస్థానం సొంత బస్సులను కొనుగోలు చేయలేకపోయిందన్న విమర్శలున్నాయి. బస్సుల కొనుగోలుతో కొందరికి ఉపాధి కల్పించడంతోపాటు, భక్తుల సొమ్ము ఖర్చు కాకుండా మిగిలేదని స్థానికులు అంటున్నారు.
ఉద్ఘాటన తర్వాత పెరిగిన భక్తులు
యాదగిరిగుట్ట ప్రధానాలయ ఉద్ఘాటన 2022 మార్చి 28న జరిగింది. దేవాలయ పునర్నిర్మాణం తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ కొండపైకి వచ్చే భక్తులకు ఉచిత ప్రయాణం ప్రకటించారు. ఇందుకోసం దేవస్థానం డబ్బులు చెల్లిస్తే యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి బస్సులను కొండపైకి నడిపేలా ఒప్పందం కుదుర్చుకుంది. భక్తుల నుంచి ఎలాంటి టికెట్ తీసుకోరు. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యాదగిరికొండపైకి ఉచిత బస్సులను భక్తుల కోసం 35 నుంచి 40 ట్రిప్పులను నడిపించారు.
2023 వరకు నడిపిన మినీ బస్సుల్లో ఒక్కో బస్సులో 40 మంది వరకు ప్రయాణించారు. ఇందుకోసం ప్రతినెలా రూ.60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఆర్టీసీకి దేవస్థానం డబ్బులు చెల్లించింది. 2023 –2024 మధ్య కాలంలో పెద్ద బస్సులు 15 వరకు నడిపారు. గత సంవత్సరం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించడంతో ఆరు బస్సులను మాత్రమే ఆర్టీసీ ప్రతిరోజూ నడిపిస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలి
ప్రభుత్వం యాదగిరిగుట్టకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. రాష్ట్రమంతా ఈవీ బస్సులను నడుపుతున్నారు. అద్దె బస్సులకు దేవస్థానం ఆర్టీసీకి చెల్లిస్తున్న డబ్బులతో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయొచ్చు కదా అని భక్తులు అంటున్నారు.