ఆవాసాల్లో పేరుకుపోతున్న చెత్తకుప్పలు
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజుల కోసారి చెత్తను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో ఆవాసాల్లో చెత్త కుప్పులు పేరుకుపోతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. పారిశుద్ధ్య విభాగంలో 31 మంది రెగ్యులర్, 130 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం 18 ఆటోలు, నాలుగు ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ఒక్కో వార్డులో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం 32 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నట్లు అంచనా. సేకరించిన చెత్తను పట్టణంలోని రైల్వే ట్రాక్ వెంట వేయడంతో డంపింగ్ యార్డుగా మారింది. ఇక్కడ పశువులు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి.


