DAV School Child Incident: Parents Not Accepted For Students Shifting - Sakshi
Sakshi News home page

‘మా పిల్లల్ని మరో స్కూల్‌కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్‌ చేయాలి’

Published Mon, Oct 24 2022 9:13 AM

DAV School Child Incident: Parents Not Accepted For Students Shifting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌– 14లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ను ఇక్కడే రీ ఓపెన్‌ చేయాలని ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తూ తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద డీఏవీ స్కూల్‌కు చెందిన సుమారు 200 మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము మూడు ఆప్షన్లు ఇస్తున్నామన్నారు.

చైల్డ్‌ వెల్ఫేర్‌ నుంచి ఒక అధికారి, పేరెంట్స్‌ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్‌ తెరవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లకు ఏ రకంగానూ తాము ఒప్పుకోవడం లేదన్నారు. సీబీఎస్‌ఈ విద్యార్థులను స్టేట్‌ సిలబస్‌ పాఠశాలల్లోకి చేర్చడం కుదరని పని అన్నారు. మెరీడియన్‌ స్కూల్‌లో చేర్చడానికి కూడా అది తాహత్తుకు మించిన వ్యవహారమవుతుందని తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకొని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  

సీబీఎస్‌ఈ స్కూళ్లలో సర్దుబాటు చేస్తాం !
బంజారాహిల్స్‌లోని డీఏవీ విద్యార్థులను సీబీఎస్‌ఈ స్కూళ్లలోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలకు తీసుకుంటామంటున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై  లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుతో పాటు పాఠశాలను మూసి వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రగులుకుంది. ఈ పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాల మూసివేత, ఇతర పాఠశాలల్లో సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పాఠశాలకు అయిదు కిలో మీటర్ల పరిధిలోని స్కూల్స్‌ మేనేజ్‌మెంట్లతో సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఆయా స్కూళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు. వారి అభీష్టం మేరకు ఆయా స్కూళలో చేరి్పంచే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్‌ డీఈఓ రోహిణి స్పష్టం చేశారు. 

మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మా బాధలు వింటూ తగిన రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్‌ ఇక్కడే రీ ఓపెన్‌ చేయాలని కోరుతున్నాం.  
 – అంజిబాబు, పేరెంట్‌

చాలా సమస్యలు వస్తాయి.. 
వేరే స్కూల్‌లో చేర్చడమంటే చాలా సమస్యలు వస్తాయి. అక్కడి వాతావరణం అలవాటు పడటం మరింత కష్టం. ఆన్‌లైన్‌ క్లాస్‌లకు మేం ఒప్పుకోం.
 – సుజాత, పేరెంట్‌  

డ్రైవర్‌ను ఉరి తీయాలి 
పిల్లలు మరో పాఠశాలకు వెళ్లడం కుదరదు. అడ్మిషన్లు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అంత ఫీజులు చెల్లించుకోలేం. కొత్త మేనేజ్‌మెంట్‌తో డీఏవీ స్కూల్‌నే కొనసాగించాలి.   
– మాతంగి హంస, పేరెంట్‌

Advertisement
Advertisement