
వాట్సాప్‌లో లింకులు పంపుతున్న సైబర్ నేరగాళ్లు
ఒకసారి క్లిక్ చేస్తే ఫోన్‌ను కంట్రోల్‌లోకి తీసుకొని మోసాలు
అనుమానాస్పద మెసేజ్‌లలో లింక్‌లపై క్లిక్ చేయొద్దంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. మోసం చేయడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా..తమదైన స్టయిల్‌లో రెడీ అవుతున్నారు. తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తమ మోసాలకు అనుగుణంగా మార్చుకున్నారు. రైతులే లక్ష్యంగా ఈ తరహా కొత్త మోసానికి తెరతీశారు. వాట్సాప్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట మెసేజ్‌లు పంపుతూ వాటిలో కొన్ని లింక్‌లు పెట్టి ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ)ఫైల్స్ పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు.
ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సైతం ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది. సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వ్యాప్తి చెందుతున్న నకిలీ సందేశాలు, లింక్‌ల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
పీఎం కిసాన్ వాట్సాప్ స్కామ్ అంటే ఏమిటి?
ఈ స్కామ్‌లో సైబర్‌నేరగాళ్లు పీఎం కిసాన్ శాఖ నుంచి ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ వాట్సాప్‌లో సందేశాలు పంపుతారు. పథకంలో కొత్తగా నమోదు చేసుకునేందుకు, మీ ఖాతాలో జమైన డబ్బుల వివరాలు పొందేందుకు ఆ సందేశంలోని లింక్‌పై క్లిక్ చేసి కొన్ని వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. దీనిని నమ్మి లింక్‌పై క్లిక్ చేయగానే మన ఫోన్‌ను హ్యాక్ చేస్తారు. ఆ తర్వాత ఆధార్, పాన్‌కార్డు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారు.
ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. సైబర్ నేరగాళ్లు ఆ సమాచారం, ఓటీపీ పొందిన తర్వాత మన బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ పొందుతారు. ఫలితంగా ఆర్థిక మోసం జరుగుతుంది. మన వ్యక్తిగత సమాచారం, ఫోన్ గ్యాలరీలోని ఫొటోలు తీసుకొని డేటా థెప్‌్టతోపాటు మన ఫొటోలు, వీడియోలు మారి్ఫంగ్ చేసి ఆన్‌లైన్ వేధింపులకు గురిచేస్తూ డబ్బు డిమాండ్ చేసే ప్రమాదమూ ఉంది.
ఈ జాగ్రత్తలు మరవొద్దు
⇒ ప్రభుత్వ లోగో లేదా సీల్‌తో అవాంఛిత సందేశాలు వచ్చినా..మన వ్యక్తిగత వివరాలు అడుగుతూ ఎస్‌ఎంఎస్‌లో పేర్కొన్నా, అది సైబర్ నేరగాళ్ల పని అని అనుమానించాలి.
⇒ అనుమానాస్పద మెసేజ్‌లలోని ఏ లింక్‌పై క్లిక్ చేయొద్దు లేదా ఏ అటాచ్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయొద్దు.
⇒ సందేశం చట్టబద్ధంగా అనిపించినా, మన వ్యక్తిగత సమాచారం లేదా ఓటీపీలను షేర్ చేయొద్దు.
⇒ ఏ సమాచారం కోసమైనా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిర్ధారించుకోవాలి.
⇒ ఇలాంటి అనుమానాస్పద లింక్‌లు మనకు తెలిసిన నంబర్ల నుంచి వచ్చినా వాటిని నమ్మి, లింక్‌లపై క్లిక్ చేయొద్దు.
⇒ నకిలీ లింక్‌లు లేదా ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం వల్ల ఫోన్ హ్యాకింగ్ అవడంతోపాటు డేటా దొంగతనం జరిగే ప్రమాదం ఉందని మరవొద్దు.