
ప్రైవేట్ సందేశాలతో కేసు నమోదు కుదరదు
అవమానించే ఉద్దేశంతో అందరి ముందు దూషించనప్పుడు ఆ కేసు వర్తించదు: హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా ప్రైవేట్‌గా పంపిన సందేశాలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. అవమానించే ఉద్దేశంతో అందరి ముందు కులం పేరుతో దూషించనప్పుడు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం కుదరదంటూ పిటిషనర్లపై కేసును కొట్టివేసింది. ఆ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్), సెక్షన్ 3(1)(ఎస్) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ఎదుట దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని చెప్పింది.
క్రాంతికిరణ్ (ఎస్సీ), నిరుపమా దాడి (కాపు) క్లాస్‌మేట్స్. వేర్వేరు కులాలకు చెందినవారు. వీరు 2014లో వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో వారు విడిపోయారు. ఈ క్రమంలో నిరుపమ, ఆమె కుటుంబ సభ్యులు తనను కులం పేరుతో దూషించారని, తన దుస్తులను తగలబెట్టారని, తర్వాత విడాకులు కోరుతూ సందేశాలు, ఈ మెయిల్ ద్వారా బెదిరించారని క్రాంతి ఫిర్యాదు చేశారు. దీంతో నిరుపమ, ఆమె తండ్రి అనుపమ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈనేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజల మధ్య దూషణలు జరగలేదని, ఇది కేవలం వారి కుటుంబ వివాదం మాత్రమేనని వాదించారు. ఇంకా సాక్షులను విచారించాల్సి ఉన్నందున ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయొద్దని క్రాంతి తరఫు న్యాయవాది, ఏపీపీ కోరారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. కుల దూషణ బహిరంగంగా జరిగినట్లు బయటి వ్యక్తులెవరూ వెల్లడించలేదని, ఇది వారి కుటుంబ వివాదం మాత్రమేనని స్పష్టంచేశారు. విచారణ కొనసాగించడం చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. పిటిషనర్లపై నమోదైన అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.