
రాష్ట్రంలో ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం
61వేల హెక్టార్లకు గాను 21వేల హెక్టార్లలోనే సాగు
సన్న వడ్ల తరహాలో బోనస్ కోసం రైతుల డిమాండ్
మెట్రిక్ టన్నుకు రూ.1,000 ఇవ్వాలని వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి సరిపోను దిగుబడి కూడా ఉండటం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెరకు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వరిసాగుకు సై అనడంతో చెరుకు సాగు విస్తీర్ణం పెరగడం లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు, చెరకు విభాగం అధికారులు చెబుతున్నారు.
చెరకు పరిశ్రమ ద్వారా ఒక్కో మెట్రిక్ టన్నుపై ప్రభుత్వానికి జీఎస్‌టీ రూపంలో రూ.250 వరకు సమకూరుతోంది. చెరకు ఏడాది పంట కావడంతో టన్నుకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. చెరకు ఫ్యాక్టరీలకు అవసరమైన ముడి సరుకుతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కీలకంగా ఉన్న చెరకు పరిశ్రమను ప్రోత్సహించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు రైతులకు బోనస్ ప్రకటించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెరకు విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.
మూడోవంతు విస్తీర్ణంలోనే సాగు !
రాష్ట్రంలో 12 చక్కెర కర్మాగారాలు ఉండగా, ఐదు కర్మాగారాలు మూత పడ్డాయి. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి క్రషింగ్ సామర్థ్యం రోజుకు 24,700 మెట్రిక్ టన్నులు. 130 రోజుల క్రషింగ్ సీజన్‌ను పరిగణనలోకి తీసుకొని లెక్క వేస్తే మొత్తంగా ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా 32.11 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరం. రాష్ట్రంలో 40వేలకు పైగా హెక్టార్లలో చెరుకు సాగు చేస్తేనే ఈ ఏడు ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా దిగుబడి వస్తుందని యాజమాన్యాలు చెబుతున్నాయి.
కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 21వేల హెక్టార్లలో మాత్రమే రైతులు చెరకును సాగు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీలకు నష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి మూతపడిన బోధన్, మెదక్, మెట్‌పల్లిలోని నిజాం డెక్కన్ షుగర్స్ యూనిట్లు తెరుచుకుంటే చెరకు పంట సాగు విస్తీర్ణం 61వేల హెక్టార్లకు చేరాలి. అంటే ప్రస్తుతం రాష్ట్రంలోని ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో కేవలం మూడో వంతు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగవుతోంది.
తమిళనాడు తరహాలో బోనస్ ఇవ్వాలి
తమిళనాడులో చెరకు రైతులకు టన్నుకు రూ.1,000 చొప్పున బోనస్ ఇస్తున్నారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెరకు రైతులకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. – రచ్చ నరసింహారావు, చెన్నారం, ఖమ్మం జిల్లా
చెరకు రైతులను ఆదుకోవాలి
చెరకు సాగులో ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదు. స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారం మూతపడటంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కనీస మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సన్న వడ్లకు ఇచ్చినట్టుగా చెరకు రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. చెరకు సాగులో యాంత్రీకరణ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. – ఈదులపల్లి ఈరన్న, హద్నూర్, సంగారెడ్డి జిల్లా