విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలి! 

Councilors of merged villages should resign In Telangana - Sakshi

డెడ్‌లైన్‌ విధించిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ 

సంక్రాంతి రోజు రోడ్ల మీద ముగ్గులు వేసి నిరసన 

ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక 

రాజీనామాకు ముందుకొచ్చిన ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు 

ముదురుతున్న కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివాదం 

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ.. విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్‌లైన్‌ విధించింది. మున్సిపల్‌ పరిధిలోని లింగాపూర్‌ గ్రామంలో గురువారం సమావేశమైన రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా విలీన గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానించింది.

ఈ నెల 20 లోపు రాజీనామా చేయాలని డెడ్‌లైన్‌ విధించింది. అలాగే సంక్రాంతి పండుగ రోజున రైతులంతా కుటుంబ సమేతంగా కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈనెల 17న పాతరాజంపేట గ్రామంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌ ద్వారా ఇండస్ట్రియల్, గ్రీన్‌ జోన్లతో పాటు వంద ఫీట్ల రోడ్ల పేరుతో భూములను కొల్లగొట్టే ప్రయత్నాలను నిరసిస్తూ రైతులంతా నెల రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాగా, మాస్టర్‌ప్లాన్‌ పై అభ్యంతరాలకు ఈ నెల 11న గడువు ముగిసింది.

మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని కోరుతూ 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి రైతులు వినతిపత్రాలు అందజేశారు. అయితే మున్సిపల్‌ తీర్మానంపై కౌన్సిల్‌ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాల ద్వారా కౌన్సిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.

కాగా విలీన గ్రామాలకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారి రవిలు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ తరువాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top