బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం | Sakshi
Sakshi News home page

బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం

Published Thu, Sep 28 2023 3:26 AM

Connection of Bangalore and Wadi lines is ready - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంత సరిహద్దు వరకు పనులు పూర్తి కావడంతో సమాంతరంగా ఉన్న రెండు ప్రధాన రైలు మార్గాల అనుసంధానానికి అవకాశం ఏర్పడింది. మహబూబ్‌నగర్‌–కర్ణాటకలోని మునీరాబాద్‌ మధ్య 243 కి.మీ. మేర జరుగుతున్న రైల్వే లైన్‌ పనుల్లో భాగంగా దేవరకద్ర–కృష్ణా స్టేషన్‌ల అనుసంధానంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో పూర్తయింది.

ఇది ఇటు సికింద్రాబాద్‌ (మహబూబ్‌నగర్‌)–బెంగళూరు లైను, అటు సికింద్రాబాద్‌–వాడీ–ముంబై లైన్‌లను అనుసంధానిస్తుంది. బెంగళూరు లైన్‌లో దేవరకద్ర నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు, వాడీ మార్గంలోని కృష్ణా స్టేషన్‌ వద్ద తెలంగాణ పరిధిలో ముగుస్తుంది. ఇక్కడి వరకు పనులు పూర్తి కావడంతో ఈ అనుసంధాన లైన్‌ను ఇప్పుడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు సహా కొన్ని ఇతర ప్రాంతాలకు వాడీ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. దీని బదులు ఆ రైళ్లు ఇకపై దేవరకద్ర మీదుగా బెంగళూరుకు చేరుకోవచ్చు. దీనివల్ల రైల్వేకు దూరాభారం తగ్గుతుంది. సరుకు రవాణా రైళ్లకూ ఇది దగ్గరి దారి కానుంది. అలాగే జక్టేర్, మరికల్, మక్తల్, మాగనూరు లాంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. 

ప్రధాని చేతులమీదుగా కాచిగూడ–సిద్దిపేట డెమూ ప్రారంభం? 
మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైల్వేలైన్‌ సిద్ధమై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ఆమోదముద్ర కూడా రావడంతో రైళ్లను నడిపేందుకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగా కాచిగూడ–సిద్దిపేట మధ్య రోజువారీ నడిచేలా డెమూ సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించే రెండు రోజుల్లో ఏదో ఒక రోజు డెమూ రైలు సర్విసును ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది.

ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ప్రధాని చేతుల మీదుగా రైలును ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది. ఇక ముద్ఖేడ్‌–డోన్‌ మార్గంలో డబ్లింగ్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు లైన్లు వినియోగానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది.  

ప్రాజెక్టు: మహబూబ్‌నగర్‌–మునీరాబాద్‌ 
మంజూరు: 1997–98 
నిడివి: 243 కి.మీ. 
ప్రాజెక్టు వ్యయం: రూ. 3,473 కోట్లు 
తెలంగాణ పరిధి: 66 కి.మీ. 
వ్యయం: రూ.943 కోట్లు 
విద్యుదీకరణ: పూర్తి 

Advertisement
Advertisement