తికమక తెలుగుతో ప్రయాణికుల తకరారు  | Sakshi
Sakshi News home page

తికమక తెలుగుతో ప్రయాణికుల తకరారు 

Published Sat, Sep 2 2023 3:21 AM

Confusion at Secunderabad railway station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల సమాచారం తెలిపే ఎల్రక్టానిక్‌ డిస్‌ప్లే బోర్డుల్లో వినియోగిస్తున్న సరికొత్త భాష ప్రయాణికులను గందరగోళం, అయోమయానికి గురి చేస్తోంది. సహజంగా ఊరి పేరు డిస్‌ప్లే చేస్తారు. కానీ ఘనత వహించిన దక్షిణ మధ్య రైల్వేలో మాత్రం ఊళ్ల పేర్లకు అర్ధాలు వెదికీ మరీ ప్రయాణికుల ముందుంచుతున్నారు. అది కూడా గూగుల్‌తో అనుసంధానించి మరీ తర్జుమా చేస్తున్నారు. దాంతో ప్రయాణికులకు సమాచారం ఇవ్వటం అటుంచి.. వారిని మరింత తికమకపెట్టి అయోమయానికి గురి చేస్తున్నారు. 

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఈ తికమక తంతు ఎలా ఉందో కళ్లకు కట్టే ఉదాహరణ ఇది. దక్షి ణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్‌ నిలయానికి అతి సమీపంలో ఉన్న ఈ స్టేషన్‌లో నిత్యం లక్షల మంది ప్రయాణికులు కళ్లప్పగించి చూసే రైళ్ల వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డు ఇది.  
 తమిళనాడులోని ఎరోడ్‌ పట్టణానికి వెళ్లే స్పెషల్‌ రైలుకు సంబంధించి వివరాలు డిస్‌ప్లే బోర్డు మీద కనిపిస్తున్నప్పుడు ఇంగ్లీష్, హిందీలో సరిగానే ఉంది. కానీ తెలుగులో ప్రత్యక్షమైనప్పుడు విస్తుపోవటం ప్రయా ణికుల వంతవుతోంది. ‘‘ఎరో డ్‌ స్పెషల్‌’’అన్న రెండు పదాలకు తెలుగులో ‘‘క్షీణించు ప్రత్యేక’’అని కనిపిస్తోంది. ఎరోడ్‌ అన్నది ఊరు పేరు అన్న విషయం కూడా మరిచి, దాన్ని ఆంగ్ల పదంగానే భావిస్తూ తె లుగులోకి తర్జుమా చేసేశారు. ఎరోడ్‌ అన్న పదానికి క్షీణించటం, చెరిగిపోవటం అన్న అర్ధాలుండటంతో తెలుగులో క్షీణించు అన్న పదాన్ని డిస్‌ప్లే బోర్డులో పెట్టేశారు. స్పెషల్‌ అంటే ప్రత్యేక అన్న పదాన్ని జోడించారు. 

తెలుగులోకి బెంగాలీ పదాలు.. 
ఇది స్టేషన్‌లోనికి వెళ్లే ప్లాట్‌ఫామ్‌ నెం.10 వైపు ప్రధాన మార్గం. ఎదురుగా భారీ ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి రైళ్ల వివరాలు ప్రద ర్శిస్తారు. అందులో నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రావటంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొంటూ దాని వేళలను మార్చారు. ఆ విష యం ప్రయాణికులకు తెలిపేందుకు డిస్‌ప్లే బోర్డు లో ఆ వివరాలు ఉంచారు. ఇంగ్లీష్లో ఆ రైలు పేరు ఎదురుగా రీషెడ్యూల్‌ అని రాసి తర్వాత కొత్త సమయాన్ని ఉంచారు.

హిందీలో పరివర్తిత్‌ సమయ్‌ అని పేర్కొన్నారు. కానీ తెలుగులో ఆ ఎక్స్‌ప్రెస్‌ పేరు ఎదురుగా బెంగాలీ భాష పదాన్ని ఉంచారు. తెలుగుకు, బెంగాలీకి తేడా తెలియని సిబ్బంది నిర్వాకమిది. ఇంగ్లీష్, హిందీ తెలియని తెలుగు ప్రయాణికులకు ఈ వ్యవహారం మతిపోగొడుతోంది. అర్ధం కాని తికమక వ్యవహారంతో వారికి రైళ్ల సమాచారం సరిగా చేరటం లేదు. 

ప్రైవేటు సిబ్బంది నిర్వాకం 
రైళ్ల వివరాలను వాయిస్‌ అనౌన్స్‌మెంట్‌ ద్వారా తెలపటం, ఎల్రక్టానిక్‌ డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలిపే పనిని రైల్లే టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఆ బాధ్యత చూసే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ గందరగోళం నెలకొంది. సాంకేతికంగా ఏదైనా తప్పు జరిగితే వెంటనే గుర్తించాల్సిన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తికమక తెలుగు సమస్య ఇప్పటివరకు పరిష్కారమవ్వలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement