స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
వైభవంగా సీతారాముల కల్యాణం
భద్రగిరిలో పట్టువ్రస్తాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
ఆలయ విస్తరణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి
నేడు శ్రీరామ పట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు జానకీరాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాచలం తరలివచ్చారు.
మధ్యాహ్నం 12 గంటలకు..
శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మిథిలా స్టేడియానికి సీతారాములను తీసుకువచ్చారు. ఆ తర్వాత వేదస్వస్తితో వివాహ వేడుకలు ప్రారంభిస్తూ ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు. ఆపై వరుసగా పుణ్యాహవచనం, శ్రీయోద్వాహం, యో్రక్తాబంధనం, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయాన అభిజిత్ లగ్నంలో వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. 12:11 గంటల సమయంలో మాంగళ్యధారణ జరగగా ఆపై తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు.
12–40 గంటల సమయాన హారతి ఇవ్వడంతో కల్యాణ క్రతువు ముగిసింది. సీఎం సతీమణి గీతతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
మహా సంకల్పం సమయంలో వచ్చిన సీఎం
భద్రగిరి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ నిర్వహించే సమయాన కల్యాణ మండపం వద్ద వరపూజ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా పాద ప్రక్షాళన, మధుపర్కం, నూతన వ్రస్తాల సమర్పణ, ఆభరణాల అలంకరణ చేయాల్సి ఉంది. అయితే మధుపర్కం సమయానికి కూడా సీఎం కల్యాణ మండపం దగ్గరకు రాకపోవడంతో తదుపరి కార్యక్రమమైన మహా సంకల్పాన్ని ఉదయం 11–37 గంటలకు మొదలెట్టారు. కాగా సీఎం 11–41 గంటలకు కల్యాణ మండపం దగ్గరకు చేరుకున్నారు. అనంతరం 11–46 గంటలకు నూతన వ్రస్తాలను సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు సమర్పించారు.
గోత్రాలు అవే...
కల్యాణం సందర్భంగా సీతారాముల గోత్రాల విషయంలో నెలకొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కల్యాణం జరిపించే వైదికులు స్పందించారు. కన్యావరణం సందర్భంగా గోత్రాలు చెప్పే విషయంలో శ్రీరాముడికి నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని, సీతమ్మ వారికి లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య గోత్రాన్ని చెప్పారు. రామదాసు కాలం నుంచి ఇవే గోత్రాలు చెబుతున్నారని, ఇకపై కూడా ఇవే గోత్రాలను చదువుతామని, ఇందులో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
రూ.351 కోట్లతో అభివృద్ధి పనులు
ఉదయం 10–45 గంటలకు సారపాకలోని హెలిప్యాడ్‌కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా భద్రాచలం ఆలయానికి చేరుకుని దైవదర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రూ.351 కోట్లతో చేపట్టే ఆలయ విస్తరణ, పునరుద్ధరణ, పుష్కరఘాట్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులకు భూమి పూజ నిర్వహించారు. వచ్చే పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా చెప్పారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. నిలువ నీడ, మంచినీటి కోసం అల్లాడిపోయారు.
నేడు పట్టాభిషేకానికి గవర్నర్
కల్యాణం ముగిసిన మరుసటి రోజు భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శనివారం జరిగే వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా రానున్నారు. ఇందుకోసం మిథిలా స్టేడియంలో దేవాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.


