దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy On Importance Of Education | Sakshi
Sakshi News home page

దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది: సీఎం రేవంత్‌

May 28 2025 3:13 PM | Updated on May 28 2025 5:47 PM

CM Revanth Reddy On Importance Of Education

హైదరాబాద్:  సమ సమాజ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్సష్టం చేశారు. తమ హయాంలో మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్.  గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలను విద్యకు దూరం చేసిందని విమర్శించారు. దళితులు చెప్పులు కుట్టుకోవాలా?, యాదవులు గొర్రెలు కాసుకోవాలా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరైనా బాగా చదవుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు సీఎం రేవంత్.

హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 59 వేల ఉద్యోగాలిచ్చిందని, గత ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ల ఇవ్వలేదని సీఎం రేవంత్ నిలదీశారు. 2011 తర్వాత గ్రూప్౧ పరీక్షలు నిర్వహించలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం  563 గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతిని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

‘ఇవాళ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు… మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనత భావాన్ని వీడాలి. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. బిఆర్ఎస్  అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారు. కానీ మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదు?,  

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా?, కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశాం. కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోంది. వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆర్నెల్లు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండి. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దు.  

కష్టపడండి… సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి.  వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించాం. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నాం. వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు. చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చింది. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement