జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పార్టీకి, ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమనే విషయం మరువద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రులు, పార్టీ నేతలతో భేటీలో సీఎం
ప్రతి ఓటరునూ కలవాలి.. నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీఆర్‌ఎస్, బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన..
మంత్రులతో విడివిడిగా సమావేశమై మాట్లాడిన రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే ఉందని.. అందువల్ల ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన అధికారిక నివాసానికి సమీపంలో గురువారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ సమక్షంలో సీఎం రేవంత్ అందుబాటులో ఉన్న మంత్రులు, ఆయా డివిజన్లకు ఇన్‌చార్జిలుగా ఉన్న నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమనే విషయాన్ని మరువద్దని మంత్రులు, నేతలను సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న అసత్య ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.
రూ. 200 కోట్ల పనులకు శ్రీకారం
అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, పార్టీ నేతలకు చెప్పారు. ఈ రెండు నెలల్లో ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రూ. 200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.
అధికారంలోకి వస్తే రూ. 400 కోట్లను కేటాయించడంతోపాటు 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామన్న హామీ ఇచ్చామని.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు, సన్న బియ్యం పంపిణీ నుంచి రుణమాఫీ, మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేసే పథకానికి శ్రీకారం చుట్టడం వంటి పథకాలను వివరించి చెప్పాలన్నారు.
సర్వేలన్నీ మనకే అనుకూలం..
ఉపఎన్నిక సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని.. ఘన విజయం సాధిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిఘా వర్గాల నివేదికలతోపాటు వేర్వేరు సంస్థల నుంచి క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలను తెప్పించుకొని అధ్యయనం చేసినట్లు చెప్పారు. అనంతరం ఒక్కో మంత్రితో సీఎం విడిగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
4 రోజుల టైంటేబుల్
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి 4 రోజుల ప్రచార టైంటేబుల్ ఇచ్చారు. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలు, క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఎవరికి కేటాయించిన డివిజన్లలో వారు ఉండాలని స్పష్టం చేశారు.
ఉదయం 5 గంటలకే నియోజకవర్గంలోని పార్కులకు వెళ్లి మార్నింగ్ వాక్‌కు వచ్చే వారిని కలవాలని.. ఉదయమంతా బస్తీలు, కాలనీల్లో పర్యటించి మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి 4 గంటలకు ప్రచారం ప్రారంభించి రాత్రి దాకా ఇంటింటి ప్రచారం కొనసాగించాలని సూచించారు. శుక్రవారం నుంచి మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. బస్తీలు, కాలనీల్లో పాదయాత్రలు చేయకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను నేరుగా కలవాలని సూచించారు.
జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్లతోపాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న బీసీ ఓటర్ల మద్దతు కాంగ్రెస్‌కే లభిస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చి జీవనం సాగిస్తున్న ఓటర్ల సంఖ్య జూబ్లీహిల్స్‌లోని మురికివాడల్లో అధికంగా ఉన్నందున బస్తీలపై దృష్టి పెట్టాలన్నారు.


