వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోం: సీఎం రేవంత్‌రెడ్డి
ఈ రెండూ చేయాల్సి వస్తే మేం ఎన్నికల్లోనే పోటీ చేయం
మేం అవి చేయకపోతే బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా?
కుప్పకూలిన డిస్కంలను బతికించేందుకే రైతు డిస్కం తెచ్చాం
సాగుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎప్పుడూ నిబంధన విధించలేదు
రైతుల కోసం తానేదో యుద్ధం చేశానని చెప్పుకునేందుకే నాడు కేసీఆర్ అలా చెప్పారు
కేంద్రం ధాన్యం కొనకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు ట్రాక్టర్లలో తెచ్చి పోస్తాం
జూన్ 15 లోపు ధాన్యమంతా కొంటాం
ఏపీకి ఏడు మండలాలిచ్చిన మోదీ తెలంగాణకు వెయ్యి ఎకరాలు ఇవ్వలేడా?
కల్వకుంట్ల కుటుంబమంతా అబద్ధాల మీదనే బతుకుతుంది
వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావు బీఆర్‌ఎస్ నుంచి పోటీచేస్తాడనే నమ్మకం లేదు
విలేకరులతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు. అసలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్రం ఎప్పుడూ పెట్టలేదని చెప్పిన రేవంత్.. ఉచిత విద్యుత్, స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్‌ఎస్‌కు సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఎత్తేసినా, వ్యవసాయానికి మీటర్లు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తాము అలా చేయకపోతే బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని వ్యాఖ్యానించారు. శనివారం రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
‘మేం అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలోని డిస్కంలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి. డిస్కంలకు ఇప్పుడు రూ.69,745 కోట్ల అప్పులున్నాయి. అవి బాగుచేయలేనంతగా నిర్వీర్యమయ్యాయి. ఉచిత విద్యుత్ కింద రైతులకిచ్చే కరెంటుకు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లించలేదు. దీంతో డిస్కంలు అప్పులు చేసి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపాల కారణంగా ఇతర అవసరాలకు వినియోగించిన విద్యుత్‌ను కూడా ఉచిత విద్యుత్ లెక్కలో రాసేవాళ్లు. వాళ్లు కనీసం ఎప్పుడు ఎంత కరెంటు తీసుకోవాలనే అంచనాలు కూడా వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక డిస్కంలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
అందులో భాగంగానే రైతులతో పాటు ప్రభుత్వం గంపగుత్తగా కరెంటును వినియోగించుకునే కేటగిరీని కలిపి ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేశాం. దీనిద్వారా ఎంత విద్యుత్ తీసుకున్నామో, ఎంత సరఫరా చేశామో, నిర్వహణ నష్టాలు ఎంతో, బిల్లులు ఎంత వస్తున్నాయో కచ్చితంగా లెక్క తేలుతుంది. తెలంగాణ రైతాంగం రాత్రిపూట పెద్దగా వ్యవసాయానికి విద్యుత్ వాడదు కాబట్టి ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఆ డిస్కం ద్వారా రైతులకు విద్యుత్ ఇస్తాం. అసలు మాకు ఉచిత విద్యుత్ ఎత్తేయాలనే ఆలోచనే లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టబోం. అలా పెట్టేది ఉంటే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోం. ఒకవేళ మేం పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ ఎత్తేయకపోయినా బీఆర్‌ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా? బీఆర్‌ఎస్ నా సవాల్‌ను స్వీకరించాలి.
అప్పుడే స్మార్ట్ మీటర్లు పెట్టారు
అసలు స్మార్ట్ మీటర్ల విషయంలో కేంద్రంతో ఒప్పందం చేసుకుంది బీఆర్‌ఎస్సే. 2017, జూన్ 30న అజయ్‌మిశ్రా, రఘుమారెడ్డి, గోపాలరావు అనే అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. 2017–18లో 29,632 స్మార్ట్ మీటర్లు కూడా పెట్టారు. కేంద్రం ఏ రోజూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అడగలేదు. అసలు అలాంటి నిబంధనే లేదు. నోరు తెరిస్తే కేసీఆర్ చెప్పేది అబద్ధాలే. రైతుల కోసం తామేదో యుద్ధం చేసినట్టు అప్పట్లో చెప్పుకుని రైతుల దగ్గర మార్కులు కొట్టేయాలని అలాంటి మాటలు చెప్పారు. రైతులు ఆయన కంటే తెలివైన వారు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు. మోదీ నా చుట్టమేమీ కాదు. ఆ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు చేరాయి. ఏపీ కూడా చేరింది.
నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాష్ట్రమంతటా స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి మాత్రం పెట్టలేదు. తీగల మీద బట్టలు ఆరేయాలని కేసీఆర్ అన్నప్పుడే 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది. కాంగ్రెస్సే. నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మగౌరవం పెంచడానికి తెచ్చిన పారదర్శక విధానమే రైతు డిస్కం. సీఆర్‌పీసీ, ఐపీసీల్లో శిక్షలు వేసేందుకు నిబంధనలు లేవా? మరి ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హెచ్‌ఆర్‌సీ, మైనార్టీ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్‌ను ఎందుకు అడుగుతున్నారు. తమ వర్గాలకు కమిషన్ ఉంటే న్యాయం జరుగుతుందనే కదా. ఆ తరహాలోనిదే రైతు డిస్కం కూడా.
మోదీకి కిషన్‌రెడ్డి చెప్పాలి కదా?
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కనీసం సీబీఐ వాళ్లు ఆపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ విషయాలను మోదీ దగ్గర కిషన్‌రెడ్డి చెప్పాలి కదా? అంతర్రాష్ట్ర జలవివాదాలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని మోదీ చెబుతున్నారు కదా? వచ్చే నెల1న ఆదిలాబాద్‌కు వెళ్తున్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా దారిలోకి రాడో చూస్తా. పోలవరం ముంపు కింద ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన మోదీ తెలంగాణ కోసం వెయ్యి ఎకరాల భూమి ఇవ్వలేడా?
సోయి తప్పిన మాటలు
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్‌ఎస్ సోయి తప్పిన మాటలు మాట్లాడుతోంది. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? కమ్మ సంఘానికి భూమి ఇవ్వలేదా? భీమవరంలో కేటీఆర్ పోటీ చేస్తానని చెప్పి బీఆర్‌ఎస్ ఏపీకి తోట చంద్రశేఖర్‌ను అధ్యక్షుడిని చేయలేదా? ఆయనకు కూకట్‌పల్లిలో 30 ఎకరాల భూమి ఇవ్వలేదా? హక్కుల కోసం పోరాటం ఎలా చేయాలో, చరిత్రలో కొందరిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అసలు తారక రామారావు అనే పేరు మార్చుకోవాలి కదా? ఆ పేరుతో ఎంతకాలం బతుకుతారు?
ప్రధానికి కనపడడం లేదా?
గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీ. ఆ సంస్థ వల్లనే తెలంగాణలో పరీక్ష పేపర్లు లీకయ్యాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సీబీఎస్‌ఈ వ్యవస్థను కూడా గ్లోబరీనా కుప్పకూల్చింది. హరీశ్, కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు. ప్రధాని మోదీకి ఎందుకు కనపడడం లేదు? బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే కదా? రెండు పెద్ద కేసుల్లో ఆధారాలతో కేంద్రానికి ఇచ్చాం. ఆ కుటుంబాన్ని అరెస్టు చేస్తారో లేదో మోదీ, కిషన్‌రెడ్డిలే చెప్పాలి. జుట్టు వారి చేతిలో పెట్టాం. రాష్ట్రంలో జనగణన, ఎస్‌ఐఆర్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తొందరేముంది? ఆర్థిక వెసులుబాటును బట్టి రైతు భరోసా చెల్లిస్తాం.
మహిళా సమాఖ్యలతో గోదాములు
ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, దళారులతో పనిలేకుండా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం. గోదాములు, రైస్‌మిల్లులను మహిళా సమాఖ్యలతో ఏర్పాటు చేయిస్తాం. బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పిస్తాం. వారినే యజమానులను చేస్తాం. దీనికి గొప్ప ప్రణాళిక మా దగ్గర ఉంది. ఇప్పటికే పెట్రోల్ బంకులిచ్చాం. సోలార్‌పవర్ ప్లాంట్లు ఇచ్చాం. ఆదానీ, అంబానీలకు మా ఆడబిడ్డలే పోటీ అనే రీతిలో వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం.
అసెంబ్లీలో చెప్పాం.. మళ్లీ చెబుదాం
రాష్ట్రం అప్పుల పాలవుతుందనే వాదనలో వాస్తవం లేదు. మేం యేటా రూ.70–75వేల కోట్లు అప్పులు తెస్తే రూ.90వేల కోట్ల వరకు పాత అప్పులు కడుతున్నాం. అన్ని లెక్కలు అసెంబ్లీలో చెప్పాం. మళ్లీ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్తాం. మేం తెచ్చిన అప్పులే కాదు కట్టిన అప్పులు కూడా చూడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత మోసం చేసినా భరించాం. ఇప్పుడు అంతా తెలంగాణ వాళ్లమే కదా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఆ కుటుంబం డీఎన్‌ఏనే అబద్ధాల డీఎన్‌ఏ. వాళ్ల మూలుగతో సహా మారిస్తేనే వారి వైఖరి మారుతుంది. అలా చేస్తే వాళ్లు ఉండరు. ఫ్యామిలీ మొత్తం అబద్ధాలమీదనే బతుకుతుంది. బ్లాక్ మెయిల్ చేసి బతుకుతుంది. చివరకు క్రషర్ల వాళ్లని కూడా పొడుగాయన బెదిరించాడు. నెలకు రూ.50 లక్షలు ఇస్తే క్రషర్ల గురించి మాట్లాడబోనని ఓ ఎమ్మెల్సీ ద్వారా బ్లాక్‌మెయిల్ చేశాడు. మూడడుగుల ఆయన, ఆరడుగులాయన చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు.
హరీశ్.. ఓ బబుల్ షూటర్
అసలు ఆరడుగులాయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు. ఆయన ఎందులో ఉంటాడో కూడా తెలియదు. గుండెల మీద చేయి వేసి కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌లోనే ఉంటాడేమో చెప్పమనండి. 2008లో వైఎస్సార్ దగ్గరకు పోలేదా? హరీశ్‌రావు మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు. ఆయన ట్రబుల్‌షూటర్ కాదు.. బబుల్ షూటర్. వచ్చే ఎన్నికల్లో ఆయన బీఆర్‌ఎస్ నుంచే పోటీ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడనే సమాచారం నాకుంది. కానీ నేను చెప్పదల్చుకోలేదు. ఓవైపు పార్టీ సమావేశం జరుగుతుంటే ఢిల్లీ వెళ్లాడు. మీడియా పట్టుకుంటే అడ్వొకేట్‌ను కలిసేందుకు వెళ్లానని ఫొటోలు పెట్టాడు. తీర్పు రిజర్వ్ అయిన కేసులో అడ్వొకేట్ దగ్గరకెళ్లి ఆయన మాట్లాడేదేముంటుంది?
కేంద్రంలో పెద్ద మంత్రి అవుతాడేమో
నాది, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. నేను పీసీసీ అధ్యక్షుడిగా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్‌గా, నేను ముఖ్యమంత్రిగా ప్రతి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉప ఎన్నికలు గెలిచాం. 2029లో కూడా మా కాంబినేషన్‌లోనే ఎన్నికల్లో గెలుస్తాం. మహేశ్‌గౌడ్ నాకు మంచి మిత్రుడు కూడా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన పెద్ద కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశముంది. మాది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. మా పనితీరును ఫలితాలే చెబుతున్నాయి. నేను 2034 వరకు ఇక్కడే ఉంటా. రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిననీయను. అన్నింటినీ కొలిక్కి తెస్తా. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా రూపుదిద్దేందుకు అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
వడ్లు కొనంది ఎవరు?
అసలు ధాన్యం కొనుగోలు చేయంది ఎవరు? కేంద్రం కాదా? వరి వేస్తే ఉరి అన్నది బీఆర్‌ఎస్ కాదా? మేము వడ్లే కాదు మక్కలు కూడా కొంటున్నాం. మక్కలకు మద్దతు ధర ప్రకటించిన వారు ఒక్క గింజయినా కొన్నారా? మేం పండిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం. పండిన పంటలో పంజాబ్ (86%), ఛత్తీస్‌గఢ్ (67%), హరియాణా (65%), ఒడిశా (52%) తరహాలో తెలంగాణ పంటఎందుకు కొనరు? తెలంగాణలో పండిన దాంట్లో 38 శాతమే కొంటారా? మేం వచ్చే నెల 15 లోపు ధాన్యమంతా కొంటాం. ఆ తర్వాత కిషన్‌రెడ్డి, మోదీ సంగతి చెబుతాం. వడ్లు కొనకపోతే బీజేపీ వాళ్ల ఇళ్ల ముందు తీసుకెళ్లి పోస్తాం. బస్సులో వెళ్లి రైతు యాత్ర చేస్తున్న వారి ఇళ్ల వద్దకు ట్రాక్టర్లు తీసుకెళతాం. ఇప్పటికే 60లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 20 లక్షల టన్నుల మక్కలు కొంటాం. ఈ స్థాయిలో ఏ రోజైనా, ఏ ప్రభుత్వమైనా కొనుగోలు చేసిందా? అకాల వర్షం వల్ల రైతులకు కొంత నష్టం కలిగింది. రైతు దుఃఖంలో ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లి సెల్ఫీ లు దిగి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక బతుకేనా?.


