సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు గురువారం గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని అన్ని సభల్లోనూ అధికారులు చదివి వినిపించారు.
⇒ ‘ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ... సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పనిచేస్తోంది. మేం పాలకులం కాదు..సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటున్నాం.
⇒ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి.
⇒ ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు.. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మా ర్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ‘ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుంచి 99 రోజులపాటు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరూవాడ స మస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియ రెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి.
⇒ మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేష న్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇ ళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి.
⇒ ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్‌తో ఆర్థికంగానే కాక, అన్నిరంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. క్యూర్, ప్యూర్, రేర్‌గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి.
⇒ ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధా రణ కార్యక్రమం కాదు..ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై... దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి’అని సీఎం సందేశం ఇచ్చారు.


