కేజీకి రూ.44 మార్జిన్‌ ఇస్తున్నాం | BICC have stated that a margin of Rs 44 per kg is being provided to retail chicken shopkeepers | Sakshi
Sakshi News home page

కేజీకి రూ.44 మార్జిన్‌ ఇస్తున్నాం

Apr 3 2026 5:35 AM | Updated on Apr 3 2026 5:35 AM

BICC have stated that a margin of Rs 44 per kg is being provided to retail chicken shopkeepers

చికెన్‌ ధరలు పెరిగినా,తగ్గినా రిటైలర్‌ లాభం తగ్గించలేదు

బీఐసీసీ ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: మార్కెట్‌లో చికెన్‌ ధరలు పెరిగినా, తగ్గినా దుకాణదారులకు ఇచ్చే మార్జిన్‌ (లాభం)లో ఎలాంటి కోతలు విధించలేదని బ్రాయిలర్‌ ఇంటిగ్రేషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (బీఐసీసీ) ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పౌల్ట్రీ రంగం ఇతర వ్యాపారాలకు భిన్నంగా ఉంటుంది. భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటిగ్రేటర్, రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. రిటైల్‌ దుకాణదారు ఎప్పుడూ నష్టపోడు. తనకు కేటాయించిన కచ్చితమైన మార్జిన్‌ స్థిరంగా ఉంటుంది.

ప్రస్తుతం రాష్ర్టంలో కిలో చికెన్‌కు రూ.44 మార్జిన్‌ అందిస్తున్నాం. పౌల్ట్రీ యాజమాన్యాలు గత ఐదేళ్ల కాలంలో మూడేళ్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 2022–23 లో కిలోకి రూ.7.96 నష్టం వచ్చింది. మొత్తం పది కోట్ల కిలోలు విక్రయించాం. అప్పులను భరించి బ్యాంకు రుణాలతో నడిపిస్తున్నాం. 2024–25లో కిలోకు రూ.6.53 నష్టం వచ్చింది. 2023–24లో కేజీకి 64 పైసలు, 2025–26లో రూ.1.60 లాభాలు వచ్చాయి.

కార్పొరేట్‌ సంస్థలు అన్యాయం చేస్తున్నాయంటున్న రిటైల్‌ వ్యాపారులు ఒక్కసారి ఆలోచించాలి. సంస్థలు ఎలా ఉన్నా హోల్‌సేల్, రిటైలర్‌కిచ్చే మార్జిన్‌ (ఫిక్స్‌డ్‌ ప్రాఫిట్‌)లో ఎలాంటి తేడాలు చూపించలేదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా చూశాం’అని చెప్పారు. ఈ సమావేశంలో స్నేహా ఫామ్స్‌ ఎండీ రామిరెడ్డి, వీహెచ్‌ఎల్‌ జీఎం బాలసుబ్రహ్మణియన్, ఎస్‌ఆర్‌ పౌల్ట్రీ ఎండీ శ్రీనివాస్, వెన్‌కాబ్‌ ఏజీఎం రాజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement