మూసీ ప్రాజెక్టుకు 'గ్రీన్‌' సిగ్నల్‌ | National Green Tribunal Green signal for Musi project | Sakshi
Sakshi News home page

మూసీ ప్రాజెక్టుకు 'గ్రీన్‌' సిగ్నల్‌

Apr 3 2026 5:16 AM | Updated on Apr 3 2026 5:16 AM

National Green Tribunal Green signal for Musi project

పర్యావరణానికి ముప్పు అనే ఆరోపణలకు ఆధారాల్లేవు 

కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదు  

ఆధారాల్లేకుండా పిటిషన్‌ను అనుమతించలేమన్న ఎన్జీటీ 

పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలన్నీ టీవోఆర్‌ పరిధిలోకి వస్తాయని ధర్మాసనం స్పష్టీకరణ 

ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: మూసీ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తెలిపింది. మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. మూసీ సుందరీకరణపై సర్కార్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కార్తీక్‌రెడ్డి గత నెల ఎన్జీటీలో పిటిషన్‌ వేశారు. దీనిపై జ్యుడీషియల్‌ సభ్యుడు జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, టెక్నికల్‌ సభ్యుడు డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గవ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.  

వాదనలు ఇలా..: పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జి.రాజగోపాలన్‌ వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సరైన పర్యావరణ అనుమతి పొందకుండానే నిర్మాణ కార్యకలాపాలు చేపడుతోంది. అందువల్ల తదుపరి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టకుండా నిరోధించాలి. ఇప్పటికే చేపట్టిన కార్యకలాపాలపై జరిమానా విధించాలి..’అని కోరారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు విన్పించారు. ‘పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాం. సుందరీకరణకు సంబంధించి చేపట్టిన కార్యకలాపాలన్నీ చట్టపరమైన అనుమతులు, దీనికి సంబంధించిన విధివిధానాలు తెలిపే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్‌)కు అనుగుణంగానే ఉన్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్‌ దాఖలైంది. 

ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టును ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. కల్పిత ఆధారాలు, దరఖాస్తులతో బెంచ్‌ను కూడా రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు..’అని వాదించారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీనాథ్‌ శ్రీదేవన్‌ వాదిస్తూ.. ఈ దశలో పిటిషన్‌ వేయడం చెల్లదంటూ కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పక్షాల వాదనల అనంతరం..ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ ఎన్జీటీ బెంచ్‌ తీర్పు వెలువరించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్ర పర్యావరణ మదింపు అథారిటీ జారీ చేసిన విధివిధానాల పత్రంలో ఇప్పటికే ఉన్నాయని పేర్కొంది. పిటిషనర్‌ తన వాదనలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని, కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ దశలో దీనిపై విచారణ చేపట్టలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement