మూల మూలకూ గోదారి పారాలి

 cm kcr review meeting on Joint Karimnagar District Irrigation project - Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రతి ఎకరం నదీజలాలతో అనుసంధానం కావాలి 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరణ నీళ్లు తెచ్చి పెట్టిన..వినియోగించుకునే బాధ్యత మీదే 

ఎక్కడా సాగునీటి సమస్య ఉండకూడదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌:  గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ఎకరం ఆ నీటితో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం అనంతరం, సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం చెప్పారు. ‘నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే’అని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాగునీటి పారుదలపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  
రోహిణి కార్తెలోనే నాట్లు వేయాలి
 
‘జూలై 10 తర్వాత, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండల స్థాయి ఇరిగేషన్‌ అధికారులు కూర్చొని, సాగు నీటిని మూల మూలకు ఎట్లా పారించాలో చర్చలు జరపాలి. ఇకనుంచి జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాట్లు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదే..’అని సీఎం చెప్పారు.  

నిజాంసాగర్‌ నుంచి నీటి విడుదలకు ఆదేశం 
మిషన్‌ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారిన నేపథ్యంలో వాటిని నూటికి నూరు శాతం నింపాలని సీఎం ఆదేశించారు. మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రతిపాదనలు తయారుచేయాల్సిందిగా అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరిని సందర్శిస్తానని తెలిపారు. నిజాంసాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు నిజాంసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.  సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవాలి 
గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగు భూములకు మళ్లించడానికి ప్రాణహితను ఆధారంగా చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్నో కష్టాలు పడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాము. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతోంది. ఏ కాలం లోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడు నీళ్ళు మన చేతిలో ఉన్నయ్‌. వాటిని ఎట్లా వాడుకుంటామనేది మన తెలివితో ముడిపడి ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదు. చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తి పోసుకోవాలి..’అని కేసీఆర్‌ సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top