కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం..!

CM KCR Order In Review On Corona - Sakshi

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అందరికీ వారంలో టీకాలు

మాస్క్‌ లేకుంటే రూ.1,000 జరిమానా వేయండి 

కరోనాపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వందశాతం వ్యాక్సినేషన్‌ చేయించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ డీజీపీ మహేందర్‌ రెడ్డి, పంచాయతీ రాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, అరవింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మతో ఫోన్లో మాట్లాడారు. వారి శాఖల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వాక్సినేషన్‌ పురోగతిని ప్రతీరోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు నివేదించాలని కోరారు. పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్టీసీ , రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టడం కోసం కలెక్టర్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

జిల్లాల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాలు
కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు అన్ని జిల్లాల్లోనూ ఆర్టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్‌ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. 

మాస్క్‌ లేకపోతే ఉపేక్షించొద్దు
దేశంలో కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను కోరారు. జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ప్రజలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చినపుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు పరచాలన్నారు.

ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్‌ శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. 45 ఏళ్లకు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ప్రజారోగ్య సంచాలకుడు డా. శ్రీనివాస్‌ రావు, డీఎంఈ రమేష్‌ రెడ్డి, వైద్యశాఖ సలహాదారు డా. టి గంగాధర్‌ పాల్గొన్నారు.

చదవండి: 2 నెలల్లోనే తారస్థాయికి 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top