కేసీఆర్‌ నిర్ణయం.. నూతన సచివాలయం సమీపంలో ట్విన్‌ టవర్స్‌! | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ నిర్ణయం.. నూతన సచివాలయం సమీపంలో ట్విన్‌ టవర్స్‌!

Published Tue, May 30 2023 4:09 AM

CM KCR directions in review of conduct Telangana decade celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన నూతన సచివాలయం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్రస్థాయిలో కీలకమైన పనులన్నీ ఒకే చోట జరిగేందుకు మార్గం పడింది. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాధిపతుల (హెచ్‌ఓడీల) కార్యాలయాలను ఒకే గొడుగు కిందికి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం కొత్త సచివాలయా­నికి సమీపంలో ట్విన్‌ (జంట) టవర్లు నిర్మించాలని.. దీనికి సంబంధించి స్థలాన్ని అన్వేషించా­లని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. 

హెచ్‌ఓడీల వివరాలపై ఆరా.. 
దేశం గర్వించేలా నిర్మించుకున్న కొత్త సచివాలయం ఉద్యోగుల విధి నిర్వహణకు అత్యంత అనువుగా ఉందని.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారని సమీక్షలో సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో.. మౌలిక వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హెచ్‌ఓడీల కార్యాలయాల కోసం ట్విన్‌ ట­వర్లను నిర్మించే అంశంపై అధికారులతో చర్చించా­రు.

అన్ని శాఖల పరిధిలోని హెచ్‌ఓడీల వివరా­లు, మొత్తం ఉద్యోగుల సంఖ్య, అవసరమైన స్థలం, సదుపాయాలు తదితర అంశాలపై ఆరా తీశారు. సచివాలయానికి సమీపంలో విశాలవంతమైన ప్ర­భు­త్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మంచి స్థలాలను అన్వేషించాలని.. హెచ్‌ఓడీల అధికారులు, సిబ్బంది తరచూ సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. సమీపంలోనే ట్విన్‌ టవర్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. స్థలం ఎంపిక పూర్తయిన వెంటనే ట్విన్‌ టవర్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. 

ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు 
తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరగాలని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జూన్‌ 2 నుంచి రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాల విషయంలో.. సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎం కేసీఆర్‌కు వివరించారు. 

జూన్‌ 9 నుంచి కుల వృత్తులకు ఆర్థిక సాయం 
కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎంబీసీ కులాలు, రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతుల ప్రజలకు దశల వారీగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌ గంగుల కమలాకర్‌ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్‌ 9న నిర్వహించ తలపెట్టిన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించాలని కేసీఆర్‌ ఆదేశించారు. 
 
అమరుల స్మారకం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం 
సచివాలయంలో సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్‌ లుంబినీ పార్కు స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారకం వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశించారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్‌అండ్‌బీ ఈఈ శశిధర్‌కు సూచించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా బీఆర్‌కేఆర్‌ భవన్‌ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. 
 
ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ స్థలంలో ట్వీన్‌ టవర్స్‌? 

ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో హెచ్‌ఓడీల కార్యాలయాల కోసం ట్వీన్‌ టవర్స్‌ నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కార్యాలయాల కోసం 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అవసర మని అంచనా వేసిన­ట్టు సమాచారం. అంతమేర భవనాల నిర్మాణా­నికి ఆదర్శ్‌నగర్‌ స్థలం అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.   

Advertisement
Advertisement