స్వర్ణ పతకధారి.. చేసేది చోరీ!! | Choutuppal police arrest suspect for 62 thefts in different districts | Sakshi
Sakshi News home page

స్వర్ణ పతకధారి.. చేసేది చోరీ!!

Apr 9 2026 4:19 AM | Updated on Apr 9 2026 4:19 AM

Choutuppal police arrest suspect for 62 thefts in different districts

ఈ దొంగోడు.. ఎంబీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ చేస్తూ చోరీలు

వేర్వేరు జిల్లాల్లో 62 దొంగతనాలు.. నిందితుడిని పట్టుకున్న చౌటుప్పల్‌ పోలీసులు

చౌటుప్పల్‌: ఎంబీఏ చదివాడు... గోల్డ్‌మెడల్‌ కూడా సాధించాడు...కానీ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ చోరీలు చేస్తున్న దొంగ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం నలందానగర్‌కు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్‌ సామ్‌రిచర్డ్‌ ఎంబీఏలో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. 

కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చి మన్సూరాబాద్‌ ప్రాంతంలో అద్దెకు ఉంటూ పలు వ్యాపారాలు చేశాడు. వాటిని విడిచి దొంగతనాలను వృత్తిగా ఎంచుకొని హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 62 దొంగతనాలు చేశాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా తిరిగి బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేసేవాడు. ఫిబ్రవరి 22న ఓ చోరీ కేసులో ఖమ్మం కోర్టుకు హాజరైన వంశీకృష్ణ తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ చౌటుప్పల్‌లోని వలిగొండ చౌరస్తా కంఠమహేశ్వర కాలనీలో నివాసముంటున్న లింగంపల్లి నర్సింహ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో దాచిన రూ.14.20 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వంశీకృష్ణ సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు అద్దెకు తీసుకుని బుధవారం ఉదయం ఖమ్మం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా అతడి కారును ఆపారు. వంశీకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చౌటుప్పల్‌లోని కంఠమహేశ్వర కాలనీలో లింగంపల్లి నర్సింహ ఇంట్లో చోరీ చేసింది తానేనని వంశీకృష్ణ ఒప్పుకున్నాడు. 

అతడి నుంచి రూ.7 లక్షల నగదు, కారు, రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.2.28లక్షల నగదును పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు.ఈ విలేకరుల సమావేశంలో సీఐ మన్మథకుమార్, సీసీఎస్‌ సీఐ ప్రవీణ్‌బాబు, ఎస్‌ఐలు యాదగిరి, వనం సైదులు, కుమారస్వామి పాల్గొన్నారు. కాగా, చోరీ చేసిన సొత్తుతో వంశీకృష్ణ వివిధ ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసేవాడని, తన చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని తిరుగుతుండేవాడని, పేదలకు దాన ధర్మాలు చేయడం, అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం కూడా చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement