విద్యుత్ కార్యాలయాలు, సబ్‌స్టేషన్ల ముందు నిరవధిక దీక్ష
గ్రేటర్‌లో మూడు వేల మందికిపైగా విధులకు దూరం
నిలిచిన కొత్త కనెక్షన్ల జారీ..ఆందోళనలో వినియోగదారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు, అన్‌మ్యాన్డ్ కార్మికులు, పీస్‌వర్క్ కార్మికులు సమ్మె సైరన్ మో గించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూని యన్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఈ) ఆధ్వర్యంలో బుధవారం ట్రాన్స్‌కో, జెన్‌కో, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సుమారు 20 వేల మంది కార్మికులు బుధవారం విధులను బహిష్కరించారు. ఖైరతాబాద్, మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ ప్రధాన కార్యాలయాలు సహా సబ్‌స్టేషన్లు, ఇతర ఆఫీసుల ముందు నిరవధిక నిరసన దీక్షలకు కూర్చొ న్నారు.
విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న అన్‌మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4వ తేదీకంటే ముందు అన్ని అర్హతలు ఉండి, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికు లుగా కొనసాగుతున్న వాళ్లను ఆర్టిజన్లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, 2026 పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టినా..ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చివరికి సమ్మెనోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినా సర్కార్ స్పందించక పోవడంతోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే డిస్కం పరిధిలోని ఉద్యోగులు, ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొనకూడదని, ఒకవేళ ఎవరైనా పాల్గొంటే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎండీ జితేశ్ పాటిల్ హెచ్చరించినా... కార్మికులు మాత్రం విధులకు హాజరు కాలేదు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు వేల మందికిపైగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టిజన్ల సమ్మె నేపథ్యంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం రెగ్యులర్ ఉద్యో గులకు బాధ్యతలు అప్పగించినప్పటికీ...సరఫరాలో ఇబ్బందులు తప్పలేదు. శివారు ప్రాంతాల్లో గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో పాటు కొత్త మీటర్ల జారీ, కనెక్షన్లు, లైన్ల పునరుద్ధరణ వంటి పనులు స్తంభించిపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పలేదు.


