రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్
సాక్షి, న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం కేవలం హైదరాబాద్‌లోనే విమానాశ్రయం అందుబాటులో ఉందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వీటిని నిర్మించాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని వారు చెప్పారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో వారు సమావేశం అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆదిలాబాద్‌లో ఎప్పటి నుంచో ఉన్న డిఫెన్స్ ఎయిర్‌్రస్టిప్ స్థానంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. ఈ అంశంపై రక్షణ మంత్రితో చర్చించామని, ఆయన సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ఎయిర్‌పోర్టు కోసం ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఉన్న 360 ఎకరాల రక్షణ శాఖ భూమితో పాటు అదనంగా మరో 450 ఎకరాల భూమి అవసరమని గుర్తించామన్నారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ పంపగా.. సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని రక్షణ శాఖే నిర్మిస్తుందని, అయితే ఒక పక్కన సామాన్య ప్రజల కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సివిల్ టర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రక్షణ శాఖకు ఇది వ్యూహాత్మక ప్రాంతం కావడంతో పాటు వైమానిక దళ శిక్షణకు కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ నెల 17న సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో విమాన రాకపోకలకు ఆటంకాల గుర్తింపు సర్వే (ఓఎల్‌ఎస్) నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం రన్‌వే ఓరియెంటేషన్‌పై నిర్ణయం తీసుకుని మాస్టర్ ప్లాన్‌కు అంగీకారం తెలుపనున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో వాణిజ్య హబ్‌గా ఎదిగే అవకాశం ఉందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘పెద్దపల్లి’కి 1,200 ఎకరాలైతే మేలు..
పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన స్థలానికి సంబంధించి ఫీజబిలిటీ నివేదిక సానుకూలంగా వచ్చినట్లు మంత్రులు తెలిపారు. ఇక్కడ విమానాశ్రయం కోసం 600 నుంచి 700 ఎకరాల భూమి అవసరమని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కనీసం 1,200 ఎకరాలు ఉంటే మేలని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానం వచ్చాక ముందుకు వెళ్తామన్నారు. ఇక కొత్తగూడెం విమానాశ్రయం కోసం రాష్ట్రం ప్రతిపాదించిన స్థలం సాంకేతికంగా అనుకూలం కాదని (నాట్ ఫీజబుల్) తేలిందని మంత్రులు తెలిపారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పౌర విమానయాన, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, ఆదిలాబాద్ కలెక్టర్ వికాస్ రాజ్ పాల్గొన్నారు.


