ట్రైనీ పైలట్‌పై ఇన్‌స్ట్రక్టర్‌ లైంగిక దాడి | Instructor physical assaults trainee pilot | Sakshi
Sakshi News home page

ట్రైనీ పైలట్‌పై ఇన్‌స్ట్రక్టర్‌ లైంగిక దాడి

Apr 9 2026 4:06 AM | Updated on Apr 9 2026 4:06 AM

Instructor physical assaults trainee pilot

ఎవరికైనా చెబితే పరువు, కెరీర్‌ను దెబ్బతీస్తానంటూ బెదిరింపులు..

బెదిరింపులు ఆపకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు..

సనత్‌నగర్‌(హైదరాబాద్‌): పైలట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇన్‌స్ట్రక్టర్‌ ఓ ట్రైనీ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరువు తీసి కుటుంబ సభ్యులకు, కెరీర్‌కు నష్టం కలిగిస్తానంటూ బెదిరించాడు. ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువకావడంతో బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి (20) బేగంపేటలోని ఏవియాకాన్స్‌ పైలట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 2025లో శిక్షణ నిమిత్తం చేరింది. 

ఆ సమయంలో అక్కడ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయం వైకోం ప్రాంతానికి చెందిన నసీముద్దీన్‌ అలియా స్‌ నసీం (30)తో  ఆమెకు పరిచయం ఏర్పడింది. నసీముద్దీ న్‌ను ఒక సోదరుడిగా ఆ యువతి భావించింది. ఈ చనువు తోనే బేగంపేట బ్రాహ్మణవాడీలో ఉండే నసీముద్దీన్‌ వద్దకు చదువుకోవడానికి తరచూ వెళ్తుండేది. గత ఏడాది డిసెంబర్‌ 27న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చదువుకోవడం కోసం ఆమె నసీముద్దీన్‌ వద్దకు వెళ్లింది.  

అయితే, 7.30 గంటల సమయంలో నసీముద్దీన్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ‘ది లీగ్‌’లో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. అప్పటివరకు ఒంటరిగా చదువుకున్న యువతి.. నసీముద్దీన్‌ రాగానే తన స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పగా, ఇక్కడే ఉండాల్సిందిగా పట్టుబట్టాడు. తన కుటుంబసభ్యులు తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తన భార్య మోసం చేసిందని, ఆమె నుంచి తరచూ తాను వేధింపులకు గురవుతున్నానని సదరు యువతిని నమ్మబలికాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఆత్మహత్య చేసుకుంటానని యువతిని బెదిరించాడు. దీంతో కొద్దిసేపు ఆమె అక్కడే ఉండిపోయింది. 

ఈ క్రమంలో నసీముద్దీన్‌ తన జీవితం గురించి ఏడుస్తూ తలుపు గడియ పెట్టి ఆమెను బలవంతంగా కౌగిలించుకున్నాడు. తాను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, అడ్డుకుని అరవకుండా నోరు మూసి, బలవంతంగా లైంగిక దాడి చేశాడు. జరిగిన సంఘటనను మరిచిపోయి ఏమీ జరగనట్లు ఉండాలని కోరాడు. నసీముద్దీన్‌ బెదిరింపులతో ఆమె భయపడి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత చదువుల కోసం దమ్మాయిగూడలో ఉండే మరో ఇన్‌స్ట్రక్టర్‌ సల్మాన్‌ ఇంటికి వెళ్తోంది. 

ఈ క్రమంలో నసీముద్దీన్‌ దమ్మాయిగూడకు మకాం మార్చి అక్కడ కూడా ఆమెను బెదిరించడం కొనసాగించాడు. దీంతో మంగళవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నసీముద్దీన్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 64(2)(ఎఫ్‌), 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement