ప్రతి డాక్టర్‌కు నగరంలోనే పోస్టింగ్ సాధ్యం కాదు
జిల్లాల్లో ప్రజలకు కూడా వైద్యులు సేవలందించాలి
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: ప్రతి డాక్టర్‌కు హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఇవ్వడం సాధ్యం కాదని, జిల్లాల్లో కూడా సమానంగా వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. బుధవారం కోఠిలో ప్రభుత్వ వైద్యుల సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తోందని మంత్రి చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న డాక్టర్ల డిమాండ్‌ను నెరవేర్చుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చామని వెల్లడించారు. గోషామహల్‌లో 26 ఎకరాల్లో సుమారు రూ.3 వేల కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పారదర్శకంగా బదిలీలు
గత రెండు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖలో 10,327 పోస్టులను భర్తీ చేశామని, మరో 6 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. డాక్టర్ల బదిలీలు పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్నామని, డాక్టర్లు తమకు నచి్చన పోస్టింగ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని రాజనర్సింహ తెలిపారు. అలాగని అందరూ హైదరాబాద్‌కే రావాలనుకుంటే సాధ్యం కాదని స్పష్టం చేశారు.
జిల్లాల్లో ఉన్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బదిలీలు, డిప్యుటేషన్ల పేరుతో వైద్య సేవలకు అంతరాయం కలిగించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, సంఘం అధ్యక్షుడు డి.నరహరి, సెక్రెటరీ జనరల్ లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి రౌఫ్ తదితరులు పాల్గొన్నారు.


