నా తప్పుంటే ముక్కు నేలకు రాస్తా..
మీడియా సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ఫైర్
నాదర్‌గుల్ భూములను రిజిస్ట్రేషన్ చేసింది? మ్యుటేషన్ చేసింది మీరేగా..
ఆ 3 కంపెనీల్లో నా కుటుంబసభ్యులు ఎవరు భాగస్వాములుగా ఉన్నా చాలెంజ్
ఖబడ్దార్... అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మోచేతి నీళ్లు తాగింది మీరు.. మీకు రూ.కోటి విరాళం ఇచ్చింది
అబద్ధాలరావు, డ్రామాల రావు, శకుని మామ టీం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజం.. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అక్రమాలు, భూదందాలన్నీ త్వరలో బయటకు వస్తాయని వ్యాఖ్య
ప్రధాన ప్రతిపక్షం చెప్పే వాటన్నింటిపై విచారణకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ‘హరీశ్‌రావు, కేటీఆర్...మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మీ స్వలాభం, స్వార్థం కోసం, పదేళ్ల కాలంలో సంపాదించిన అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం కారు కూతలు కూస్తే మా ప్రభుత్వం భయపడదు. అడవి పంది బురదను తెచ్చి సింహానికి పూయాలని చూస్తే ఆ సింహం తిరగబడి బురదలోంచి లేవకుండా అడవి పందిని తొక్కి చూపిస్తుంది. పదేళ్లలో మీరు చేసిన అక్రమాల చిట్టా, భూ దందా వ్యవహారాలు, అన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసే సందర్భం త్వరలోనే వస్తుంది...’ అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తన తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తానని, ప్రధాన ప్రతిపక్షం దగ్గర ఏమేం ఉన్నాయో అన్నీ చెప్పాలని, వాటన్నింటిపై విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఇటీవల తనను ఉద్దేశించి చేస్తున్న ఆరోపణలపై బుధవారం ఆయన స్పందించారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, నవీన్‌యాదవ్, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, శ్రీగణేశ్‌లతో కలిసి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలతో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
తమ ఆస్తులు ఎక్కడ బయటకు వస్తాయన్న ఆందోళనతో..
‘మేం కేరళ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే కొందరు నాయకులు పచ్చి అబద్ధాలతో పలు ఆరోపణలు చేశారు. అబద్ధాల రావు, డ్రామాల రావు, శకుని మామ టీం కలిసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. పదేళ్ల క్రితం తమ ఆస్తులు, ఇప్పటి ఆస్తులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతో అబద్ధాలే ఎజెండాగా పెట్టుకుని ప్రేలాపనలు చేస్తున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జూపల్లితో పాటు నాపై అసెంబ్లీ సాక్షిగా నిందలు వేస్తున్నారు. పదేళ్లలో వారికి అంటిన బురదను మాకు అంటించాలని చూస్తున్నారు.
ఆ భూమి బీఆర్‌ఎస్ హయాంలోనే రిజిస్టర్ అయ్యింది..
నాదర్‌గుల్‌లోని 613 సర్వే నంబర్‌లో ఉన్న 373.22 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ దొరలు అధికారంలో ఉన్నప్పుడే 1–9–2014న యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎస్టేట్స్, ఒమెగా డెవలపర్స్ అనే కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే భూమిని 24–09–2016న మ్యుటేషన్ కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? (10–02–2021, 05–12–2021, 05–01–2022, 17–11–2022 తేదీల్లో గూగుల్ మ్యాప్‌లు చూపించి ఆ భూమిలో ఏం జరిగిందో వివరించారు.) షీట్లు పెట్టి రోడ్లు వేసింది మీరు కాదా? ఈ భూమిని నాలా కన్వర్షన్ చేయడం లేదని 2022లో ఆ కంపెనీలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిపై కౌంటర్ వేయలేదు.
మేం అధికారంలోకి వచ్చాక 17–03–2025న కౌంటర్ వేశాం. అసలీ భూమిని కాపాడేందుకు కొట్లాడుతోందే మేము. మేం అధికారంలోకి వచ్చాక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించలేదు. ఈ భూమికి సంబంధించిన ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. అలాంటప్పుడు మాకేం సంబంధం ఉంటుంది? ఈ మూడు కంపెనీల్లో నా భార్య, కొడుకు, కుటుంబ సభ్యుల్లో ఎవరు భాగస్వాములుగా ఉన్నా చాలెంజ్. ఖబడ్దార్... అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. ఓ పత్రికలో దీని గురించి వార్త రాసిన రెండు రోజులకు అబద్ధాలరావు, శకుని కొడుకు, ఆ మేఘా సంస్థ అధినేతతో రహస్యంగా కలిసి సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాతే ఆరోపణలను నావైపు మళ్లించారు. శకుని మామ, కొడుకు ఇద్దరే సెటిల్ చేసుకుంటారేమోనని అబద్ధాలరావు తన వానర సైన్యాన్ని వేసుకుని భూమి మీదకు వెళ్లాడు..’ అని పొంగులేటి చెప్పారు.
వట్టినాగులపల్లి భూమిని నాలా కన్వర్షన్ చేసిందెవరు?
‘వట్టి నాగులపల్లి బాగోతం పచ్చి అబద్ధం.111 జీవో పరిధిలో ఉన్న ఆ భూమిని అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల ముందు 14–08–2023న నాలా కన్వర్షన్ చేసిందెవరు? షా కుటుంబంలో చిచ్చు ఎందుకు పెట్టారు? ఓఆర్‌ఆర్ కింద కోల్పోయిన భూమి మేరకు శకుని మామకు కావాల్సిన వారి కంపెనీ తీసుకున్న భూమిలో వాటా తగ్గుతుందనే పైభాగంలో ఉన్న షా కుటుంబ సభ్యులను రెచ్చగొట్టారు. ఆ భూమి కోసమే ఇదంతా చేస్తున్నారు. ఆ భూమిలోని మరో భాగాన్ని షా కుటుంబం నుంచి డెవలప్‌మెంట్‌కు తీసుకున్న కంపెనీలో నా కొడుకు భాగస్వామి. నా కొడుకు ఉన్న కంపెనీ ఆ భూమిని కొనలేదు. షా కుటుంబ సభ్యుల దగ్గర డెవలప్‌మెంట్ కోసం తీసుకుంది..’ అని మంత్రి చెప్పారు.
‘రాఘవ’ రోడ్డు మెటీరియల్ కొనుక్కుంది
‘కొత్వాల్‌గూడ క్రషర్ విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పారు. తిరుమల పేరుతో 2007 నుంచే క్రషర్ ఉంది. పవర్ బిల్లులు, జీఎస్టీ బిల్లులు అన్నీ ఉన్నాయి. ఓఆర్‌ఆర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో క్రషర్లను సీజ్ చేశారు. ఆ తర్వాత రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వేసే రేడియల్ రోడ్లకు అవసరమైన మెటీరియల్‌ను తిరుమల మెటీరియల్ ఇండస్ట్రీస్ నుంచి కొనుక్కుంది. బుద్వేల్‌లో గత ప్రభుత్వం అమ్మిన భూమిలోని బండరాళ్లను మాత్రమే క్రష్ చేశారు. వాళ్లు కొత్తగా క్రషర్ పెట్టలేదు. ఒక్క బ్లాస్టింగ్ కూడా చేయలేదు. దీనిపై ఆర్టీఐ కింద అబద్ధాలరావు, టీం సమాచారం అడిగి ఇదిగో మైనింగ్ చేస్తున్నారంటూ అసెంబ్లీలో పేపర్లు చూపెట్టారు. అయితే ఆ పేపర్ మెటల్ సీనరేజి కట్టాలని ఇచ్చింది. దాన్ని చూపించి అదిగో క్రషర్‌కు, రాఘవకు సంబంధం అంటారు. క్రషర్‌కు, రాఘవకు ఏం సంబంధం? అబద్ధాల రావు అయితే ఉరి వేసుకుంటా అంటాడు. పెట్రోల్ కొంటానికి డబ్బు ఉంటుంది కానీ అగ్గిపెట్టె లేదన్న దాంట్లో నిజం ఎంత ఉందో ఈ ఉరి కూడా అంతే నిజం.
మీరెలా దోచుకున్నారో ప్రతిదీ బయటకు వస్తుంది..
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా? దాని మోచేతి నీళ్లు తాగినోళ్లు మీరు. కోటి రూపాయల విరాళం మీ పార్టీకి ఇచ్చింది. శకుని మామ కూతురు అబద్ధాల రావు గురించి కాళేశ్వరం నుంచి డెయిరీ వరకు 10 అభియోగాలు మోపింది. ఒక్కదానికయినా సమాధానం చెప్పాడా? రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..ఆయన పేరు అబద్ధాల రావు అని పెట్టాలా? బ్లాక్‌మెయిల్‌రావు అని పిలవాలా? అగ్గిపెట్టెరావు బాగుంటుందా? సూచనలివ్వండి. అబద్ధాల రావు, డ్రామాల రావు, శకుని మామ కుటుంబ సభ్యులకు 2014లో ఉన్న ఆస్తులేంటి? ఇప్పుడున్న ఆస్తులేంటి? ఏ ప్రాంతీయ పార్టీకి లేని ఆస్తులు వాళ్ల పార్టీకి ఎలా వచ్చాయి? ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ సీబీసీఐడీ ద్వారా ఎంక్వైరీలో బయటకు వస్తుంది..’ అని పొంగులేటి అన్నారు.


