సీఎస్‌ఆర్‌ను ఖర్చులా కాదు.. భాగస్వామ్యంగా చూడండి | CM Revanth Reddy Comments On CSR Funds | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఆర్‌ను ఖర్చులా కాదు.. భాగస్వామ్యంగా చూడండి

Apr 9 2026 2:13 AM | Updated on Apr 9 2026 2:13 AM

CM Revanth Reddy Comments On CSR Funds

కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ నరేందర్‌రెడ్డి, యోగితా రాణా, శ్రీదేవసేన, ‘మేఘా’ సుధారెడ్డి తదితరులు

సత్ఫలితాలు ఇచ్చేలా సీఎస్‌ఆర్‌ నిధులు

నిధులు వినియోగించే రంగాలను మీరే ఎంచుకోండి 

పిల్లలకు నాణ్యమైన విద్య అందరి బాధ్యత

కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద సమాజాభివృద్ధికి చేసేది ఖర్చులా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని.. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగించాలని సూచించారు. అయితే కంపెనీలు సీఎస్‌ఆర్‌ కింద చేస్తున్న వ్యయం వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భవిష్యత్‌ అవకాశాలను అందిపుచ్చుకునేలా తయా రు చేయగలమన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్‌ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వివిధ కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.  

నిధులు స్థానికంగానే వినియోగించాలి 
రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 44 శాతం హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని సీఎం అన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్‌ఆర్‌ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని చెప్పారు. సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకోసం నియమించామని తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగించవచ్చని సూచించారు. రహేజా గ్రూప్‌ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్‌ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్‌ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చాయంటూ ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.  

మమ్మల్ని ఇలా ఎవరూ సంప్రదించలేదు.. 
సీఎస్‌ఆర్‌ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న సీఎంకు అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణపై వారు ఆసక్తి చూపారు.. సమావేశంలో రహేజా ఫౌండేషన్‌ నుంచి శ్రావణ్‌ కుమార్, రాంకీ ఫౌండేషన్‌ నుంచి దాక్షాయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్‌ గోరుకంటి సురేందర్‌ రావు, గోరుకంటి ఫల్గుణ్‌ రావు, మేఘా నుంచి సుధారెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణారెడ్డి, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నుంచి శేఖర్‌రెడ్డి, నాదం ఫౌండేషన్‌ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, కామినేని భాస్కర్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్‌ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికొలస్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement