
వాటర్ పైప్‌లైన్లలోకి వెళ్లి కాలుష్యాన్ని గుర్తించే రోబోలు
పైలట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో అమలు
సత్ఫలితాలు ఉంటే నగరమంతా విస్తరణ
జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భూగర్భ తాగు నీటి జల మార్గాలలో కాలుష్య మూలాలు, లీకేజీలను త్వరితగతిన గుర్తించి సత్వరమే సమస్యను పరిష్కరించేందుకు జలమండలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక రోబోలను రంగంలోకి దించింది. ఇవి నేరుగా పైపుల్లోకి వెళ్లి లీకేజీలను, కలుషితాలను గుర్తిస్తాయి. చెన్నైకి చెందిన సోలినాస్ ఇంటిగ్రిటీ డీప్‌టెక్ సంస్థ ఎండోబోట్.. స్వాస్థ్ సాంకేతికతతో వీటిని రూపొందించింది.
సుమారు 70 ఎంఎం నుంచి 250 ఎంఎం డయా పైప్‌లైన్లలో ఈ రోబోలు సాఫీగా పనిచేస్తాయి. పైప్‌లైన్‌లో కాలుష్య కారకాలు కలిసే ప్రాంతం, పైప్‌లైన్ జీవితకాలం, అక్రమ ట్యాపింగ్ తదితర కీలక సవాళ్లను ఈ రోబోలు గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో మూడు రోబోలను ప్రవేశపెట్టారు. 132 ప్రాంతాల్లో నీటి కాలుష్యంపై వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోనే ఈ రోబోలతో పరిష్కరించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి.
అక్రమ కనెక్షన్ల గుర్తింపు
హైదరాబాద్‌లో భూగర్భ నీటి సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తి తరచూ నీరు కాలుష్యమవుతోంది. పైప్‌లైన్లలో లీకేజీలతో ఈ సమస్య వస్తోంది. అయితే, భూగర్భంలో ఈ కలుషిత మూలాలను గుర్తించడం జలమండలికి తలకు మించిన భారంగా మారింది. తరచూ రోడ్లపై గుంతలు తవ్వాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ కెమెరాతో కూడిన అధునాతన ‘క్విక్ ఇన్‌స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టం (క్యూఐడబ్ల్యూపీఎస్) యంత్రాలను పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు.
కానీ, ఆ యంత్రానికి ఉండే కెమెరా చెడిపోవటం, కేబుల్ సమస్య, పాడైన పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో ఆర్థికంగా భారంగా మారింది. దీంతో వాటి స్థానంలో రోబోలను ప్రవేశపెడుతున్నారు. ఇవి పైప్‌లైన్ లోపల తిరుగుతూ సమస్యను కనుగొంటాయి. జీఐఎస్ మ్యాపింగ్‌తో ఆ పైప్‌లైన్ మార్గంలో ఉన్న వాటర్ కనెక్షన్ల సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. దీంతో అక్రమ, సక్రమ కనెక్షన్ల సమాచారం కూడా రికార్డు అవుతోంది.
ఈ రోబోలకు లైట్‌తో కూడిన ‘హై రిజల్యూషన్ కెమెరా’ఉంటుంది. దానిని పైపులై¯న్‌లోకి పంపించి భూ ఉపరితలంపై ఉండే మానిటర్‌లో పరిస్థితిని ప్రత్యక్షంగా చూడవచ్చు. రోబో గుర్తించే దృశ్యాలతో వీడియో సైతం రికార్డు అవుతోంది. దీంతో కాలుష్యమూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడ మాత్రమే రోడ్డును తక్షణం రిపేర్లు చేసేందుకు వీలవుతోంది.
సత్ఫలితాలు ఇస్తే రోబోటిక్స్ సేవలు విస్తరిస్తాం
పైప్‌లైన్లలో కాలుష్య మూ లాలను గుర్తించేందుకు ఏఐ రోబోలను ప్రయోగిస్తున్నాం. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి అక్కడే రోడ్డు, పైప్‌లైన్ కట్‌చేసి మరమ్మతులు చేస్తున్నాం. ప్రస్తు తం పైలట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో అమలు చేస్తున్నాం. సత్ఫలితాలు వస్తే అన్ని డివిజన్లలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – మాయంక్ మిట్టల్, ఈడీ, జలమండలి