
పూర్తిస్థాయి పేషెంట్ ఎక్స్‌పోజర్ లేదు
తరగతుల నిర్వహణలోనూ లోపాలే
ప్రొఫెసర్ల కొరత.. కలుషిత వాతావరణం
బోధన, మౌలిక వసతులు, మానసిక ఆరోగ్యంపై ఆందోళన
ఫైమా–ఆర్‌ఎంసీ నిర్వహించిన సర్వేలో వైద్య విద్యార్థుల వెల్లడి
దేశవ్యాప్తంగా వైద్య విద్యావ్యవస్థలోని లోపాలను వెల్లడించిన ఫైమా
సాక్షి, హైదరాబాద్: దేశంలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, శిక్షణ ప్రమాణాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని తేలింది. వైద్య విద్యార్థులకు బోధించే నిపుణులైన ప్రొఫెసర్లు, ప్రాక్టికల్ శిక్షణ అందించే ప్రొఫెసర్లు పూర్తిస్థాయిలో లేరని ఫెడరేషన్ ఆఫ్ ఆల్‌ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లతో నిర్వహించిన ఫైమా–రివ్యూ మెడికల్ సిస్టం (ఆర్‌ఎంఎస్) సర్వేలో వైద్య కళాశాలల్లోని లోపాలు వెలుగుచూశాయి.
దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 2 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అందులో 90.4 శాతం మంది ప్రభుత్వ కాలేజీలు, 7.8 శాతం మంది ప్రైవేట్ కాలేజీలకు చెందినవారు ఉండగా, ప్రముఖ వైద్య విద్యాసంస్థలైన ఎయిమ్స్, పీజీఐ, జిప్‌మార్ వంటి కళాశాలలకు చెందిన వైద్యులతోపాటు ఆండమాన్ నికోబార్ దీవులకు చెందిన వైద్యులు కూడా పాల్గొనడం విశేషం.
మౌలిక వసతుల కొరత, బోధనలో నిర్లక్ష్యం
కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయిలో పేషెంట్ ఎక్స్‌పోజర్ లేదని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 89.4 శాతం మంది మౌలిక వసతుల లేమి..వైద్యవిద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో పేషెంట్ ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉన్నా, పాలనా భారం అధికంగా ఉందన్నారు.
ప్రైవేటు కాలేజీల్లో బోధన క్రమబద్ధంగా ఉన్నా, అక్కడ మౌలిక వసతుల స్థాయి తక్కువగా ఉందని సర్వేలో స్పష్టమైంది. సర్వేలో పాల్గొన్న 71.5 శాతం మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు పేషెంట్ ఎక్స్‌పోజర్ ఉందని చెప్పగా, మిగతా 29.5 శాతం మంది లేరని చెప్పారు.
» తరగతుల నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. 54.3 శాతం మంది మాత్రమే తరగతులు క్రమం తప్పకుండా జరుగుతున్నట్టు చెప్పగా, 69.2 శాతం ల్యాబ్‌లు, పరికరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 44.1 శాతం మంది కళాశాలల్లో స్కిల్ ల్యాబ్స్ పనిచేస్తున్నట్టు తెలిపారు.
» అధ్యాపకుల విషయంలో 68.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్టైపెండ్ సగం మందికి మాత్రమే అందుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. ప్రైవేటు కళాశాలల్లో స్టైఫండ్ ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా ఉన్నట్టు తేలింది.
» 73.9 శాతం మంది అధిక క్లెరికల్ పనిభారం ఉందని చెప్పగా, స్థిరమైన పనిగంటల్లోనే విద్యాబోధన ఉన్నట్టు కేవలం 29.5 శాతం మంది మాత్రమే చెప్పారు.
» సిబ్బంది కొరత ఉన్నట్టు 55.2 శాతం మంది చెప్పగా, 40.8 శాతం మంది తమ కళాశాలల పరిసరాలు కలుషితమైన వాతావరణంలో ఉన్నట్టు పేర్కొన్నారు.
నేషనల్ టాస్క్‌ఫోర్స్ సిఫారసులు అమలు కాలేదు
2024లో నేషనల్ టాస్‌్కఫోర్స్ జరిపిన సర్వేలో వైద్య కళాశాలల నిర్వహణ ఎలా ఉండాలనే అంశంపై కొన్ని సూచనలు చేసింది. రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించి స్థిరమైన పనిగంటలు ఉండాలని, ప్రతి మెడికల్ కాలేజీకి మానసిక ఆరోగ్య కౌన్సిలర్‌ను నియమించాలని సూచించింది. ఏటా మానసిక ఆరోగ్య సమీక్షల్లో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం, 10 రోజుల సెలవు వంటి సిఫార్సులు చేసినా, వాటిలో ఒకటి రెండు మాత్రమే కొన్ని చోట్ల అమలైనట్టు సర్వేలో తేలింది.
తక్షణ జోక్యం అవసరం
కొత్తగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలతోపాటు ప్రైవేటు రంగంలోని ఇతర కళాశాలల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండకుండా చూసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్ తక్షణ జోక్యం అవసరమని ఫైమా పేర్కొంది. ఫైమా సర్వేకు సంబంధించిన తుది నివేదికను త్వరలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎంసీ, నీతి అయోగ్‌లకు సమరి్పంచనుంది. మెడికల్ విద్యార్థుల మానసిక, విద్యా సంక్షేమానికి సమగ్ర సంస్కరణలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఫైమా తెలిపింది.