
సాక్షి, హైదరాబాద్: 1.48 లక్షల ఎకరాల్లో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మద్దతు ధర, బోనస్ 500 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో అగ్రికల్చర్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు సెక్టార్లకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. నల్సార్ యూనివర్సిటీ కి 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. నల్సార్ యూనివర్సిటీలో 25 నుంచి 50 శాతం సీట్ల కేటాయింపు కోటా పెంచుతూ కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2A, 2B పొడిగింపుపై అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్‌గా ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది. రూ.10,500 కోట్లతో 5,500 కి.మీ మేర హ్యామ్ రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతాం.
ఇద్దరు పిల్లలకు మించి సంతానం వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.
మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్‌ఫోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.