
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన మేరకు తెలంగాణలో మొత్తం 1,272 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ. 18,492 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన వివరాలను మే 24వ తేదీనాడే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పంపించిందని చెప్పారు. సోమవారం ఆయన వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
జాతీయ రహదారుల విభాగం వార్షిక ప్రణాళిక కింద తెలంగాణకు 787 కిలోమీటర్ల రోడ్లకు గాను రూ.6,962 కోట్లు కేంద్రం కేటాయించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కింద మరో 485 కిలోమీటర్లకు రూ.11,530 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల కోసం రూ. 14,630 కోట్లను కేంద్రం కేటాయించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అందులో జాతీయ రహదారుల విభాగం కింద రూ. 6,421 కోట్లు, ఎన్‌హెచ్‌ఏఐ కింద మరో రూ.8,209 కోట్లు కేటాయించిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు అంతకు ముందున్న దానికన్నా ఎక్కువ జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మోదీ ప్రభుత్వం వచ్చేవరకు ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయో.. మోదీ ప్రభుత్వం వచ్చాక అన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణను చేపట్టి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.
50% జనాభా ఆర్‌ఆర్‌ఆర్ లోపలే..
రూ.17 వేల కోట్లతో 340 కిలోమీటర్ల పొడవున 125 గ్రామాల నుంచి రింగ్ రోడ్డు వెళ్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. 17 చోట్ల జాతీయ, రాష్ట్ర హైవేలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు అద్భుతంగా ఆవిష్కృతం కాబోతోందన్నారు. 50 శాతం జనాభా ఈ రోడ్డు లోపలే ఉంటుందని, తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన అద్భుత కానుక ఇది అని పేర్కొన్నారు. మొదటి దశలో నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్ జంక్షన్‌వరకు ఉంటుందన్నారు. రోడ్డు పరిసరాల్లో భూములు కొంటున్నారనే వార్తలు వస్తున్నాయని, భూములు కొనుక్కోవాలా? అని తనను కూడా అడుగుతున్నారని చెప్పారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదని, అలాగే రోడ్లు ఎలా వెళతాయన్నది డీపీఆర్ రాకముందు ఏమీ తెలియదని మంత్రి స్పష్టం చేశారు. డీపీఆర్‌ను కన్సల్టెన్సీ తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ రోడ్డు వస్తే తెలంగాణ ముఖ స్వరూపమే మారుతుందన్నారు. టౌన్‌షిప్‌లు, ట్రాన్ప్‌పోర్టు, టూరిజం అభివృద్ధి పెరుగుతుందని, తెలంగాణ గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు. పూర్తిగా కేంద్రం నిధులతోనే దీని నిర్మాణం జరుగుతుందని, భూసేకరణకు కూడా 50 శాతం నిధులు కేంద్రం సమకూరుస్తుందని, 50 శాతం నిధులను రాష్ట్రం వెచ్చిస్తుందని చెప్పారు. మొదటి దశ డీపీఆర్ పూర్తయిన తర్వాత రెండో దశకు వెళతామన్నారు. ధాన్యం కొగుగోలులో సమస్యలను ఎఫ్‌సీఐ, కేంద్ర మంత్రులతో మాట్లాడి పరిష్కరిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
- రీజనల్ రింగ్ రోడ్డు వస్తే రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. తెలంగాణ గేమ్ ఛేంజర్ అవుతుంది.
- 340 కిలోమీటర్ల పొడవున, 125 గ్రామాల నుంచి వెళుతూ, 17 చోట్ల జాతీయ, రాష్ట్ర హైవేలను కలుపుతూ ఆర్‌ఆర్‌ఆర్ అద్భుతంగా ఆవిష్కృతం కాబోతోంది. 50 శాతం జనాభా ఈ రోడ్డు లోపలే ఉంటుంది.
- రోడ్డు పరిసరాల్లో భూములు కొంటున్నారనే వార్తలు వస్తున్నాయి.. భూములు కొనుక్కోవాలా? అని నన్ను కూడా అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. అలాగే రోడ్లు ఎలా వెళతాయన్నది డీపీఆర్ రాకముందు ఏమీ తెలియదు. డీపీఆర్‌ను కన్సల్టెన్సీ తయారు చేయాల్సి ఉంది. – కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
నేడు ఆర్‌ఆర్‌ఆర్ కన్సల్టెన్సీ టెండర్లు ఓపెన్
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసే కన్సల్టెన్సీ ఎంపిక కోసం చేపట్టిన టెండర్ ప్రక్రియ కరోనా కారణంగా ఆలస్యం అయిందని కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎవరూ టెండర్లు వేయకపోవడంతో మళ్లీ పిలిచామని, ఈ నేపథ్యంలో జూన్ 1 వరకు టెండర్ల గడువును పొడిగించారని చెప్పారు. మంగళవారం టెండర్లు ఓపెన్ చేస్తారని తెలిపారు. అది ఖరారైతే రాష్ట్రం భూసేకరణ పనులను చేపడుతుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి టెండర్లు వేయవచ్చన్నారు.