
కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కోరం కనకయ్య
పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు ఆమోదించిన మంత్రివర్గం
రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపాలని నిర్ణయం
బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు వీలుగా బిల్లులు రూపొందించిన సర్కారు
బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్
వరద నష్టంపై నేడు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో సీఎం సమీక్ష
కేబినెట్ భేటీ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై 50% గరిష్ట పరిమితి ఎత్తివేసి పంచాయతీరాజ్, పురపాలక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వే షన్లు కల్పించేందుకు వీలుగా రూపొందించిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర శాసనసభలో ఈ రెండు బిల్లులను ఆమోదించి రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
బీసీ కోటా పెంపునకు అడ్డంకిగా
నాటి బిల్లులు: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గత మార్చిలో శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపించగా, ఆయన ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. రిజర్వేషన్లపై 50% సీలింగ్ విధిస్తూ 2018లో పంచాయతీరాజ్ చట్టానికి, 2019లో మున్సిపల్ చట్టానికి నాటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సవరణ బిల్లులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారాయని విమర్శించారు.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తివేసేందుకు గత మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్‌లను ఆమోదించి గవర్నర్‌కు పంపించగా, ఆయన వాటిని సైతం ఆమోదించకుండా రాష్ట్రపతికి సిఫారసు చేశారని చెప్పారు. మరోవైపు పంచాయతీరాజ్ ఎన్నికలను సెపె్టంబర్ 30లోగా పూర్తి చేయాలంటూ హైకోర్టు గడువు విధించిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇటీవల న్యాయ నిపుణులతో చర్చించిందని తెలిపారు.
తాజాగా బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించిందని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేష్లన్లు కల్పించాలని నిర్ణయించిందన్నారు. 50% సీలింగ్ ఎత్తివేసేందుకు వీలుగా ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రెండు బిల్లుల ఆమోదానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ల పేర్లను ప్రతిపాదించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలతో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఆదివారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
వర్షాలతో జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే లైన్లు, చెరువులకు జరిగిన నష్టంపై సమగ్ర అంచనాలను సిద్ధం చేసి పూర్తి వివరాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా మంత్రివర్గం వారిని ఆదేశించిందని తెలిపారు. అత్యవసరంగా చేపట్టాల్సిన పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ఈ సమీక్షలో సీఎం ఆమోదం తెలుపుతారన్నారు.
గోవుల సంక్షేమానికి కొత్త విధానం
గోవుల సంక్షేమానికి విధివిధానాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గోవుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, సీఎస్‌ఆర్, ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ తదితర అంశాలతో ఒక పాలసీని రూపొందించినట్టు పొంగులేటి తెలిపారు. ఇలావుండగా ప్రాజెక్టులకు వచ్చే వరదలను కచ్చితంగా అంచనా వేసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాల సమకూర్చుకోవడానికి కావాల్సిన కేంద్ర నిధుల కోసం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో చేరాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
డబ్బులు చెల్లించని మిల్లర్లపై పీడీ యాక్ట్
గత ప్రభుత్వం 2022–23 రబీ సీజన్‌లో సమీకరించి మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఇంకా 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీ కాలేదని, ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బులను రికవరీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని పొంగులేటి తెలిపారు. డబ్బులు చెల్లించని మిల్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని తీర్మానించామన్నారు. మత్స్య సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో వాటిలోని సభ్యులనే పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.