
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్న పొంగులేటి.. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేసినట్లు చెప్పారు. రిజర్వేషన్ల బిల్లులను గతంలో ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్‌కు పంపామని.. రేపు(ఆదివారం) అసెంబ్లీలో బిల్లులు పెట్టి ఆమోదిస్తామని మంత్రి తెలిపారు.
2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి అన్నారు. విచారణ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ పెడతాంమన్నారు. సెప్టెంబర్‌లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని.. ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. రేపు అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించామని తెలిపారు.సోమవారం పంట నష్టంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని.. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి చెప్పారు.
‘‘రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగింది. దురదృష్టవశాత్తు పలువురు ప్రాణాలను కోల్పోయారు. వర్షాల వల్ల జరిగిన నష్టాల పై సోమవారం రిపోర్ట్ సిద్ధం చేస్తాం. సాయంత్రం సీఎం ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. గవర్నర్‌కు పంపిన బిల్లులను కలిపి రేపు అసెంబ్లీలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ హైడ్రాలజీ టెక్నాలజీకి చెందిన యంత్ర పరికరాలను కొనుగోలుకు కేబినెట్ ఆమోదించింది’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 42 శాతం బీసీలకు లోకల్ బాడీలో ఇవ్వాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే బిల్లు, ఆర్డినెన్సు ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళి నాలుగు నెలలు అవుతుంది. లోకల్ బాడీలో 50 శాతం సీలింగ్ ఎత్తివేసేందుకు రేపు సభలో బిల్లు సవరణ చేస్తున్నాం. గతంలో 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దు అంటూ సవరణ బిల్లు చేశారు’’ అని పొన్నం పేర్కొన్నారు.
