
కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్న కరీంనగర్ వైద్యులు
బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
యూరియా అడిగితే రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?... జీఎస్టీ పేరిట ఎనిమిదేళ్లలో రూ.15 లక్షల కోట్ల దోపిడీ
చంద్రబాబు కోసమే మేడిగడ్డను పట్టించుకోవడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుతాన్ని రైతు ద్రోహిగా, బీజేపీ సర్కార్‌ను ప్రజా ద్రోహిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకుందన్నారు. కానీ బిహార్ ఎన్నికల కోసం శ్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
కరీంనగర్‌కు చెందిన వైద్యులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి బుధవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని, సూర్యాపేటలో గిరిజన యువకుడిపై థర్డ్ డగ్రీ ప్రయోగించారన్నారు.
పోలీసుల దాష్టీకాన్ని ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెబుతున్న ‘మొహబ్బత్‌కీ దుకాణ్’అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని ఘాటుగా విమర్శించారు.
గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ తీరని ద్రోహం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి అమలు చేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందన్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) బృందం సభ్యులు బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు.
ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్లు అహ్మద్ బిన్ అబ్దుల్ ఖుదర్, శ్యామ్ సుందర్, లోకుర్తి నరేష్‌కు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం ఇప్పటికీ అందలేదన్నారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తే బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
రేవంత్.. మోదీ, చంద్రబాబుల కోవర్ట్
‘ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే రేవంత్ తప్పు పట్టడం లేదు.. కానీ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారు.
రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యం. గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదు, నాయకులుగా మనమే విఫలమయ్యాం. ఎమ్మె ల్యే ఓడిపోయినా ఫర్వాలేదు, కేసీఆర్ గెలిస్తే చాలని ప్రజలు భావించడం వల్లే మనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కష్టపడి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దాన్ని ఆగం చేస్తోంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.