బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు హరీష్‌ రావు వార్నింగ్‌ | brs leaders fire on bjp mp tejasvi surya Over Comments On Telangana | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు హరీష్‌ రావు వార్నింగ్‌

Apr 16 2026 6:02 PM | Updated on Apr 16 2026 6:58 PM

brs leaders fire on bjp mp tejasvi surya Over Comments On Telangana

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ మేరకు మాజీ మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించమే. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనం . బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారు.

ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?. ప్రధాని మోడీ కూడా గతం లో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారు. నాడు మోదీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారు.

తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు.   లోక్ సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే తేల్చేవారు. బీజేపీ ఎంపీలు అయినా కాంగ్రెస్ ఎంపీ లైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారారు. తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తాం. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరు. తెలంగాణ అంటే పోరాట గాథ… త్యాగాల చరిత్ర.. స్వాభిమానానికి ప్రతీక. దానిని అగౌరవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదు’అని హెచ్చరించారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement