జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌పై బీఆర్‌ఎస్ విశ్లేషణ
సైలెంట్ ఓటింగ్ అనుకూలిస్తుందని లెక్కలు
ఉదయం నుంచే వార్ రూమ్‌లో కేటీఆర్, హరీశ్‌రావు
పార్టీ నేతలకు ఫోన్లు చేసి అభినందించిన అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన బీఆర్‌ఎస్ మంగళవారం జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపోటములకు ఉన్న అవకాశాలపై లెక్కలు కడుతోంది. అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర ఒత్తిళ్లు, పోటీ ఎదురైనా ఈ నెల 14న వెలువడే ఉప ఎన్నిక ఫలితాల్లో విజయం సాధిస్తామనే విశ్వాసం పార్టీ నాయకత్వంలో నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ అభ్యర్థిపై సానుభూతి, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అనుకూల ఫలితాన్ని సాధించి పెడుతుందనే ధీమా పార్టీ శిబిరంలో కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు ఫోన్లు చేసి అభినందించడంతోపాటు బీఆర్‌ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
వార్ రూమ్‌లోనే c, హరీశ్
పోలింగ్ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు మంగళవారం తెల్లవారుజామునే వార్ రూమ్‌కు చేరుకున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ నేతలు, కేడర్‌ను సమన్వయం చేస్తూ దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ ముగిసే వరకు వార్ రూమ్‌లోనే గడిపిన కేటీఆర్, హరీశ్‌రావు.. డివిజన్లు, బూత్‌లు, క్లస్టర్ల వారీగా పోలింగ్ వివరాలను విశ్లేషించారు. కాంగ్రెస్ నుంచి ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా సైలెంట్ ఓటింగ్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పోలైందనే అంచనాకు వచ్చారు. కనీసం 2 శాతం ఓట్లతో కాంగ్రెస్‌పై పైచేయి సాధిస్తామని బీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది.
ఉదయం నుంచే ఫిర్యాదుల పర్వం: పోలింగ్ ప్రారంభమైన మరుక్షణం నుంచే కాంగ్రెస్ నేతల కదలికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యా దుల ప్రక్రియను మొదలు పెట్టింది. డబ్బుల పంపిణీ, బెది రింపులు, దాడులు, రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల నుంచి ఏజెంట్లను బయటకు పంపడం, దొంగ ఓట్లు, బయటి నేతలు నియోజకవర్గంలోనే తిష్టవేయడం తదితరాలకు సంబంధించి బీఆర్‌ఎస్ 60కి పైగా ఫిర్యాదులు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు నియోజ కవర్గంలో సంచరిస్తుండటంపై బీఆర్‌ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ శ్రేణులు, ఓటర్లకు ధన్యవాదాలు: కేటీఆర్
‘గడిచిన నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన నేతలు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురి చేసినా బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


