కమలంలో కాంగ్రెస్‌ కోవర్టులు? | BJP Fears For Covert Politics | Sakshi
Sakshi News home page

కమలంలో కాంగ్రెస్‌ కోవర్టులు?

May 28 2026 7:12 AM | Updated on May 28 2026 12:11 PM

BJP Fears For Covert Politics

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్‌ కోవర్టులున్నారనే ఆరోపణలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు అంతర్గతంగా అంటకాగుతున్నారని, సన్నిహితంగా మెలుగుతున్నారనే చర్చ కమల దళంలో కాక పుట్టిస్తోంది. 

కొందరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గ స్థాయిల్లో ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టుగా పార్టీ నాయకత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరోవైపు మరికొందరు పార్టీ నేతలు, వివిధ స్థాయిల నాయకులు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తో సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలూ గట్టిగానే వినిపిస్తుండటంతో బీజేపీ అధినాయకత్వం కూడా అప్రమత్తమైందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. 

క్లాస్‌ పీకిన పాటిల్‌ 
ఇటీవల రాష్ట్ర బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం సందర్భంగా...తెలంగాణ ఇన్‌చార్జి అభయ్‌ పాటిల్‌ కొందరు నేతలను ముఖాముఖి ప్రశ్నించి పద్థతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీచేయడం చర్చనీయాంశమయ్యింది. కొందరు ప్రజాప్రతినిధులు అవసరం ఉన్నా, లేకపోయినా సీఎంను కలుసుకోవడం ఆయనతో వేదికలు పంచుకోవడం, తమ నియోజకవర్గానికి చెందిన కార్యక్రమం కాకపోయినా పాల్గొని సీఎంకు స్వాగతాలు పలకడంపై వంటి వాటిపై అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమ నియోజకవర్గంలోని సమస్యలు, ఇతర అంశాలపై సీఎంను కలుసుకోవడంలో తప్పేమీ లేదని, అయితే సీఎం మీటింగ్‌లకు వెళుతూ, సంబంధం లేని చోట వేదికలు పంచుకుంటే కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల వ్యవహారశైలిని పాటిల్‌ నిలదీసినట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా కాంగ్రెస్‌ నేతలతో కుమ్మక్కు, మిలాఖత్‌లపై తమ వద్ద ఆధారాలున్నాయనే విధంగా పాటిల్‌ ద్వారా అగ్రనేతలు సంకేతాలిచ్చారని అంటున్నారు.  

మున్సిపోల్స్‌లో పెద్దెత్తున మిలాఖత్‌.. 
మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అనేక జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు అధికచోట్ల, బీఆర్‌ఎస్‌ విజయానికి కొన్నిచోట్ల బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలు కూడా జరిగాయని, ఇటు ఎన్నికల కోసం ఇచ్చిన పార్టీ ఫండ్‌ను ఎదుటిపార్టీ ఇచ్చిన డబ్బును కొన్ని జిల్లాల్లో కొందరు పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు కూడా పెద్దెత్తున వచ్చాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా లేని మెదక్, మంచిర్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, జనగామ తదితర జిల్లాల్లో బహిరంగంగానే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు బీజేపీ నాయకులు సహకరించినట్టు అప్పట్లో విమర్శలు వినిపించాయి. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులకు కొన్నిచోట్ల అతి తక్కువ ఓట్లు (కొన్నిచోట్ల సున్న) రావడానికి నాయకుల తీరు, రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కు కావడమే కారణమని కూడా పార్టీ నిర్థారించింది. ఈ వ్యవహారంపై ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు లిఖితపూర్వక ఫిర్యాదులు కూడా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా మున్సిపల్‌ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌కు లోపాయికారీగా సహకరించిన తీరుపై రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం నిలదీసి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.  

మళ్లీ ఆ ముద్ర పడకుండా .. 
బీఆర్‌ఎస్‌–బీజేపీ కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్‌..కాంగ్రెస్‌–బీజేపీల మధ్య అవగాహన ఉందని బీఅర్‌ఎస్‌.. తరచుగా ఆరోపణా్రస్తాలు సంధించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆరోపణల వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా తీరని నష్టం జరిగిందని భావిస్తున్న జాతీయ నాయకత్వం..ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మరో రెండున్నరేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పార్టీపై అలాంటి ముద్ర ఏదీ లేకుండా క్లీన్‌గా వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటినుంచే సిద్ధం చేసే దిశలో చర్యలు చేపడుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పూర్తి బలం పుంజుకుని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే వాతావరణం నెలకొనగానే..పార్టీపై ఆరోపణలు, ఇతర రూపాల్లో ఎప్పటికప్పుడు ఏదో ఒకపెద్ద అవాంతరం ఎదురై చతికిలపడాల్సి వస్తోందని అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారా? కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారా? అనే అనుమానాల నేపథ్యంలో.. మరోసారి గతంలో మాదిరి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ‘కోవర్ట్‌’ల అంశంపైనా నాయకత్వం గట్టిగా దృష్టి కేంద్రీకరించిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement