
ముకేందర్ కుటుంబీకులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పొంగులేటి, ఎంపీ బలరామ్‌నాయక్
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభం
రవీంద్రభారతిలో సీఎం, డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్/ బూర్గంపాడు: నూతనంగా రూపొందించిన భూభారతి చట్టాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. వివిధ మండలాల్లో రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమలుచేసిన ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతులకు మేలుచేసేలా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూభారతి చట్టాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ చట్టం రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. 14న భూ భారతి పోర్టల్‌ను సీఎం ప్రారంభిస్తారని రెవెన్యూశాఖ వర్గాలు కూడా తెలిపాయి.
నెలాఖరులోగా ఇల్లు మంజూరు చేస్తా..
మణుగూరు టౌన్: ‘కమ్మటి భోజనం పెట్టావు అక్కయ్యా.. నీ కష్టం నేను చూడలేకపోతున్నా... ఈ నెలాఖరులోగా నీకు ఇల్లు మంజూరు చేస్తా.. మూడు నెలల్లో ఇల్లు కట్టుకోండి.. మళ్లీ వస్తాను’అంటూ వంకా ముకేందర్ కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి భరోసా కల్పించారు. మణుగూరు పర్యటన సందర్భంగా కూనవరంలో సన్నబియ్యం లబ్దిదారుడు ముకేందర్ నివాసంలో సన్నబియ్యంతో శుక్రవారం భోజనం చేశారు. ముకేందర్ కుటుంబ సభ్యులకు మంత్రి స్వయంగా వడ్డించారు.
ఈ సందర్భంగా ‘మీకు ఏం సాయం కావాలి’అని పొంగులేటి ప్రశ్నించగా.. ఇల్లు, పిల్లలకు ఉద్యోగాలు లేవని, తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని కుటుంబ పెద్ద శివలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. అందుకు మంత్రి స్పందిస్తూ ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆమె పెద్దకుమారుడికి రాజీవ్ యువ వికాసం ద్వారా కిరాణా షాపు పెట్టించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను ఆదేశించారు.