ఆదుకున్న ‘భృతి’

Beedi Workers Suffering From Financial Crisis In Korutla - Sakshi

లాక్‌డౌన్‌తో బీడీ కార్మికుల తిప్పలు.. ఆసరాగా నిలిచిన జీవనభృతి   

కోరుట్ల: అసలే అరకొర పనులతో అవస్థలు పడుతున్న బీడీ కార్మికుల ఉపాధికి కరోనా గండికొట్టింది. బీడీలు చేసి కుటుంబాలను పోషించుకోవడం తప్ప ఇతర పనులు చేసుకోలేని కార్మికులకు జీవనభృతి ఆసరాగా నిలిచింది. మినీ సిగరేట్లతో బీడీ కార్మికుల ఉపాధి ఇప్పటికే ప్రశార్థకంగా మారగా..కరోనా లాక్‌డౌన్‌ మరింత సమస్యల్లోకి నెట్టింది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో బీడీ కార్మికుల ఉపాధి అవకాశాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి.  

రెండురోజులకోసారి.. 
గతేడాది సుమారు 9 నెలలపాటు సాగిన కరోనా లాక్‌డౌన్‌ ఫలితంగా పూర్తి స్థాయిలో బీడీ కంపెనీలు బంద్‌ కాగా చాలా మంది కార్మికులు వర్ధి బీడీలు చేసి కంపెనీలు ఇచ్చినంత కూలి తెచ్చుకొని కాలం గడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాజిటివ్‌ కేసులు పెరగడంతో ప్రభుత్వం మొదట నైట్‌ కర్ఫ్యూ ప్రక టించింది. మేలో పాజిటివ్‌ కేసులు మరింత పెరగడంతో 12వ తేదీ నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. నైట్‌ కర్ఫ్యూ సమయంలో రెండురోజులకోసారి బీడీ కంపెనీలు కార్మికులకు పనులు కల్పించాయి. నెలకు పదిరోజులకు మించి బీడీ కార్మికులకు పని దొరకలేదు. మే 12 తర్వాత సంపూర్ణ లాక్‌డౌన్‌తో కంపెనీలు బంద్‌ చేయడంతో కార్మికులకు పూర్తిగా ఉపాధి కరువై నానాతిప్పలుపడ్డారు.  

మూడునెలలపాటు.. 
లాక్‌డౌన్‌లో సుమారు 3 నెలలపాటు అరకొర పనులు ఉండడంతో ఇబ్బందులుపడ్డ బీడీ కార్మికులను సర్కార్‌ అందిస్తున్న జీవన భృతి ఆదుకుంది. జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా 84 వేల మందికి పింఛన్‌ కింద ప్రతీ నెల రూ.2వేల జీవనభృతి అందుతోంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో బీడీ తయారీ కుంటుపడిన కాలంలో కార్మికులు పింఛన్‌ డబ్బుతో కాలం వెల్లదీశారు. పింఛన్‌ రాకుంటే తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసినా బీడీ కంపెనీలు పూర్తిస్థాయిలో పనులు కల్పించడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీనెల 26 రోజులపాటు పనులు కల్పించాల్సి ఉంటుంది.  

బీడీ పింఛనే దిక్కయింది 
కరోనాతో బీడీ కంపెనీలు రెండునెలలపాటు బంద్‌ పాటించాయి. రోజు 800 నుంచి వెయ్యి బీడీలు చేసి నెలకు రూ.4 వేల దాకా సంపాదించుకునే మేము రెండునెలలు పనులు లేక తిప్పలు పడ్డాం. అంతో ఇంతో బీడీ పింఛన్‌ రూ.2వేలు రావడం మాకు ఆసరా అయింది.  
– పొలాస లక్ష్మి, కోరుట్ల

పూర్తి పనులు కల్పించాలి 
కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేసి వారంరోజులు గడుస్తుంది. ఇప్పటికీ బీడీ కంపెనీలు రోజు విడిచి రోజు ఆకు తంబాకు ఇస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసినట్లే కానీ కంపెనీలు మాత్రం పూర్తిగా పనివ్వడం లేదు. నెలరోజుల్లో కనీసం 20 రోజులైనా పని ఇస్తే బీడీల తయారీపై ఆధారపడిన మాకు కొంత మేలు జరుగుతుంది.  
– గోనె సరోజ, బీడీ వర్కర్, కోరుట్ల   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top